ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో ధ్వజావరోహణ
- చండీశ్వరునికి త్రిశూల స్నానం
- నేడు స్వామివార్ల పుష్పోత్సవ,
శయనోత్సవ సేవ
శ్రీశైలం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఈనెల 11 నుంచి పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైన మకర సంక్రమణ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం పంచాహ్నిక దీక్షతో కొనసాగిన రుద్రయాగానికి యాగశాలలో పూర్ణాహుతి ద్రవ్యాలను సమర్పించడంతో యాగాలు ముగిశాయి. కార్యక్రమంలో ఈఓ నారాయణభరత్‌గుప్త, అర్చకులు, వేదపండితులు నారికేళం, వివిధ సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, నవధాన్యాలతో కూడిన పూర్ణాహుతి ద్రవ్యాలకు ప్రత్యేక పూజలను చేసి కర్పూర హారతితో హోమగుండానికి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చండీశ్వరపూజ, మండపారాధనలు, పంచావరణార్చన, జపానుష్ఠానము, కలశోద్వాసన చేశారు. చండీశ్వరున్ని పల్లకీలో ఊరేగిస్తూ వసంతోత్సవం నిర్వహించారు. మల్లికా గుండంలో త్రిశూల స్నానం, తీర్థప్రసాద వితరణలు జరిగాయి. అదేరోజు రాత్రి ఉత్సవాల ఆరంభంలో భాగంగా సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేసి ధ్వజారోహణ చేయడం తెల్సిందే. కాగా ఉత్సవ ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి.. గంటల తరువాత ధ్వజస్తంభంపై ఉన్న ధ్వజపటాన్ని అవరోహణ చేసి కిందకు దించారు. కార్యక్రమంలో ఏఈఓ కృష్ణారెడ్డి, సంబంధిత విభాగాధిపతులు, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మల్లన్నకు పుష్పోత్సవ, శయనోత్సవ సేవ
శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నిక దీక్షతో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిశాయి. సంక్రాంతి పర్వదినాన వధూవరులైన పార్వతీదేవి, శ్రీ మల్లికార్జునస్వామివార్లకు మంగళవారం పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమంలో స్వామివార్లకు 11 రకాల పూలు, వివిధ రకాలైన పండ్లతో శాస్త్రోక్తంగా పుష్పోత్సవ, శయనోత్సవ సేవలను నిర్వహిస్తారని ఈఓ నారాయణభరత్‌గుప్త తెలిపారు.