అయ్యాగారికి దండం పెట్టు
ఉదయమే సన్నాయి వాయిద్యాల చప్పుళ్లు.. ఓ వ్యక్తి నోట్లో పీకలు పెట్టుకుని ఊదుతుండగా.. మరో వ్యక్తి డోలు వాయిస్తుంటారు. మరో ఇద్దరు ప్రాణాలను పణంగా పెట్టి ప్రదర్శన ఇస్తుంటారు. గంగిరెద్దు నోట్లో తలపెట్టి.. దాని కాళ్లు తమ దేహంపై ఆనించి.. ఇలా రకరకాలు విన్యాసాలు చేస్తుంటారు. ఇంకొకరు పొట్టేలతో ఢీకొట్టే ఆటను ఆడుతారు. చూసేవారందరికీ ఇదంతా సంక్రాంతి సందడి. కానీ ఇది గంగిరెద్దుల వాళ్ల జీవితాల్లోని చీకటి జడి.
అమ్మగారికి దణ్ణం పెట్టు.. అయ్యగారికి దణ్ణం పెట్టు అంటూ వారు చేసే ప్రదర్శనంతా గుప్పెడు బియ్యానికి.. ఓ ఐదు, పది రూపాయలకి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..బతుకుదెరువు కోసం కాళ్లకు పనిచెప్తున్న ఈ సంచార జీవులు ఈ సంక్రాంతిలోనే ఎక్కువగా కనిపిస్తారు. తర్వాత కూలీ పనులకు వెళ్తారు. గంగిరెద్దులతో సంక్రాంతికి కాంతిని తెచ్చే వారి జీవన చిత్రం.