సర్కారు కక్ష.. ఎలా పరీక్ష
సర్కారు కక్ష.. ఎలా పరీక్ష
Published Wed, Jan 4 2017 2:01 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM
ఏలూరు సిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. విద్యార్థులకు ప్రాక్టికల్, థియరీ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. సిలబస్ పూర్తికాక వారంతా ఆందోళన చెందుతున్నారు. జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 33 రోజులుగా సమ్మె చేస్తుండగా.. వారిని శాంతింప చేయాల్సిన ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమ్మె విరమించకుంటే ఉద్యోగాలు తొలగించడం ఖాయమంటూ బెదిరింపులకు దిగుతోంది. అటు ఇంటర్ విద్యార్థుల జీవితాలు.. ఇటు కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
పరీక్షల వేళ.. ఏమిటిలా!
విద్యార్థుల భవిష్యత్‌కు ఇంటర్మీడియెట్ అత్యంత కీలకం. వారికి ఈ నెలాఖరున ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాంట్రాక్ట్ అధ్యాపకులు 33 రోజులుగా సమ్మెలో ఉండటంతో సిలబస్ పూర్తికాలేదు. వారం రోజుల్లో సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. అనంతరం ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 32 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 16వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 2,500 మంది సైన్స్ విద్యార్థులు. సైన్ గ్రూపులతోపాటు ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ పూర్తికాక.. పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
హామీ ఏమైంది ?
టీడీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. ఆ హామీ నెరవేరకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. బాబు వస్తే జాబు రెగ్యులర్ అవుతుందనుకున్నామని.. ఇలా ఉద్యోగాలకు ఎసరు పెడతారనుకోలేదని వారంతా ఘొల్లుమంటున్నారు.
32 జూనియర్ కళాశాలలు.. 264 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు
జిల్లాలో 32 జూనియర్ కళాశాలల్లో 264 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. మరో 100 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 60 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు, 50 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులంతా 16 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. 4 నుంచి 6 నెలలకు ఒకసారి జీతాలు చెల్లిస్తున్నా.. ఏదో ఒక రోజున ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని వారంతా సమ్మెకు దిగటంతో డిసెంబర్ 27న ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Advertisement