కోనసీమలో ‘సర్వమంగళం’
ఐ.పోలవరం : తన దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్వమంగళం’ పూర్తి కుటుంబ కథాచిత్రమని ఆ సినిమా డెరైక్టర్ ఛత్రపతి శివాజీరాజు చెప్పారు. చిత్రం అందరి మన్ననలు పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సర్వమంగళం’ చిత్రీకరణ గత రెండురోజులుగా మండలంలోని కేశనకుర్రుపాలెం గ్రామంలో జరుగుతోంది.
ఈ సందర్భంగా శివాజీరాజు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా శ్రీనివాసరెడ్డి, పూర్ణ నటిస్తున్నారని తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు కోనసీమ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో నారాయణరావు, వేణుగోపాల్, కృష్ణుడు తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారని శివాజీరాజు చెప్పారు. కాగా గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్‌ను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారితో కేశనకుర్రుపాలెం సందడిగా కనిపించింది.