పంటలను కాపాడండి
-
సాగునీటి కోసం వైఎస్సార్ సీపీ ఆందోళన
-
రోడ్డుపై బైఠాయించిన రైతులు, నాయకులు
పెరికీడు (హనుమాన్‌జంక్షన్ రూరల్) : సకాలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతూ రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని వైఎస్సార్‌సీపీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కష్ణా–ఏలూరు కాలువకు సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన మంగళవారం అందోళన నిర్వహించారు. ఎంఎన్‌కే రాష్ట్ర రహాదారిపై బాపులపాడు మండలం పెరికీడులోని ఏలూరు కాలువ వంతెనపై బైఠాయించారు. కష్ణా డెల్టాను పరిరక్షించాలని, రైతుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఏలూరు కాలువ వంతెనపై రెండు గంటలు బైఠాయించి రాస్తారోకో చేయడంతో సుమారు ఐదు కిలోమీటర్లు మేర వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. ఈ సందర్భంగా దుట్టా రామచంద్రరావు మాట్లాడుతూ సాగునీటి విడుదలపై తెలుగుదేశం ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందన్నారు. పట్టిసీమ పూర్తి చేశామని, పొలవరం కుడి కాలువ ద్వారా కష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు గొప్పలు చెబుతున్నప్పటికీ, రైతుకు సాగునీరు అందటం లేదని విమర్శించారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన కష్ణా డెల్టాలో ఎన్నడూ లేని విధంగా గడిచిన రెండేళ్లుగా పంట పొలాలు బీడు భూములుగా మారిపోయాయని అందోళన వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా ప్రకటనలపై నమ్మకం లేని చాలామంది రైతులు ఖరీఫ్‌లో వరి సాగు చేయలేదని, కేవలం 20 శాతం విస్తీర్ణంలోనే సాగు చేసిన్నప్పటికీ నీరు అందక ఎండిపోతోందని తెలిపారు. దాదాపు రెండు గంటల అందోళన తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు రాగా... పదిరోజుల క్రితమే ఏలూరు కాలువకు 1,100 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు నీళ్లు దిగువకు ఎందుకు రాలేదని దుట్టా ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ప్రస్తుతం ఆ నీటిని 850 క్యూసెక్కులకు తగ్గించారని, కాలువలో ఎగువ భాగాన నాచు పేరకుపోవటంతో తొలగింపు చర్యలు చేపట్టామని ఇరిగేషన్ జేఈ ఎం.భగవతి చెప్పారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులు నీళ్లు విడుదల చేసిన తర్వాత చేయటంపై దుట్టా ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండురోజుల్లో పనులు పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు సాగునీరు విడుదల చేస్తామని జేఈ హామీ ఇవ్వటంతో అందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, పార్టీ జిల్లా కార్యదర్శి నక్కా గాంధీ, ఎంపీటీసీ సభ్యులు బేతాళ ప్రమీలారాణి, కొనకళ్ల వెంకటేశ్వరరావు, మంగళపాటి కమలకుమారి, కానుమోలు పీఏసీఎస్ అధ్యక్షుడు చిన్నాల సత్య గణేష్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి రామిశెట్టి వెంకటేశ్వరరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వెలగపల్లి ప్రదీప్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొడెబోయిన బాబి, పార్టీ మండల అధ్యక్షుడు ఆళ్ల గోపాలకష్ణ, రైతు విభాగం నాయకుడు గరికపాటి ఉమా, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పడకల వీర్రాజు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కొమరవల్లి గంగాభవానీ, చింతా దేవరాణి పాల్గొన్నారు.