ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి భారీ విరాళం
Published Thu, Jul 28 2016 4:08 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
హైదరాబాద్: ఎస్‌బీఐ ఆద్వర్యంలో దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామని, ప్రస్తుతం బ్యాంక్ లాభాల్లో 1 శాతం కేటాయిస్తున్నామని, దాన్ని 2 శాతానికి పెంచడానికి కృషి చేస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ.1.15 కోట్ల విరాళాన్ని ఆస్పత్రి చైర్మన్ గుళ్లపల్లి ఎన్‌రావుకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ విరాళం మొత్తాన్ని పేదల ఉచిత శస్త్ర చికిత్సలకు, ఉచిత ఔట్ పేషెంట్ సేవలకు వినియోగించాలని కోరారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత అందుబాటులోకి తేవడానికి దేశవ్యాప్తంగా 20 గ్రామాల్లో ‘డిజిటల్ విలేజ్ ’ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఒరాకిల్ కంపెనీతో కలిసి ‘డీ ఛేంజ్’ పేరుతో అగస్ట్ 6వ తేదీన హైదరాబాద్‌లో ఓపెన్ స్కూళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఇలాంటి 100 పాఠశాలలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌వీ ప్రసాద్ సంస్ద అందిస్తున్న సేవలను అభినందించారు. అనుబంధ బ్యాంక్‌ల విలీనంపై అడిగిన ప్రశ్నకు స్పందించడానికి నిరాకరించారు.
Advertisement