‘వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి’
Published Wed, Jul 20 2016 11:43 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
కాగజ్‌నగర్ : ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చెన్నూరి శ్రీనివాస్ మాదిగ, జలంపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎల్కటూరి అంజయ్య మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎస్సీ వర్గీకరణకై ప్రధాని నరేంద్ర మోడికి లేఖ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మాన్‌సూన్ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నెల 19 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు (25 రోజుల పాటు) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగనున్న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల రిలే దీక్షలు, ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యకర్తలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు రమేశ్ మాదిగ, దుర్గ ప్రసాద్ మాదిగ, తిరుపతి మాదిగ, కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Advertisement