భయం భయంగా చదువులు..!
-
శిథిలావస్థకు చేరిన బోదంపల్లి పాఠశాల
-
వర్షం వస్తే విద్యార్థులు ఇంటికే
-
ఇబ్బందుల్లో విద్యార్థులు
కౌటాల : మండలంలోని బోదంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. చిన్నపాటి వర్షానికే భవనం ఉరుస్తోంది. ఫలితంగా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 91 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రెండు గదులతో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు.
అయితే దాని పైకప్పు చిన్నపాటి వర్షానికే ఉరుస్తోంది. దీంతో పాఠశాల విద్యార్థులు ఆరు బయట చేట్ల కిందనో, లేదంటే ఇళ్లకు వెళ్లి పోయే పరిస్థితి నెలకొంది. భవనానికి పూర్తి స్థాయి మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రస్తుతం భవనం శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాలలో అదనపు గదులు నిర్మించినా వాటి పరిస్థితి కూడా దయనీయంగానే మారింది. అందులో ఒక గది స్టోర్ రూంగా, మరొక గదిని తరగతి గదికి కేటాయించారు. అయినా తరగతి గదులు సరిపోకపోవడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులూ ఇబ్బందులు పడుతున్నారు.
చెట్ల కిందే చదువులు
భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలిపోతుందోనని, ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనల చెందుతున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో 6, 7 తరగతి విద్యార్థులు పాఠశాల ఆవరణంలోని చేట్ల, పాఠశాల గదుల వరండాలో పాఠాలు వింటున్నారు. వర్షం వస్తే తమ పరిస్థితి దారుణంగా మారుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసంపూర్తిగా అదనపు గదుల నిర్మాణం
బోదంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆర్‌ఎంఎస్‌ఏ కింద అదనపు గదుల నిర్మాణాలకు రూ.19 లక్షల నిధులు మంజూరయ్యాయి. బిల్లులు సకాలంలో రాకపోవడంతో అదనపు గదుల నిర్మాణం పునాదులకే పరిమితమైంది. దీంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం నిర్మిస్తున్న అదనపు తరగతుల భవనం నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యత పాటించడం లేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
పూర్తిగా నిర్మించని ప్రహరీ...
పాఠశాల చుట్టూ నిర్మించ తలపెట్టిన ప్రహరీ నిర్మాణం అసంపూర్తిగానే మిగిలిపోయింది. పాఠశాల ఎదుట గేటు ఏర్పాటు చేయలేదు. అలాగే పాఠశాల ముందు వైపు భాగంలో ప్రహరీని నిర్మించలేదు. దీంతో పశువులు, వీధి కుక్కలు పాఠశాల ఆవరణంలో వస్తున్నాయి.