స్కూల్ విద్యార్థులకు ఆధార్
ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్న కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఇకపై ఆధార్ నంబరు ఉండేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం లోని 59.54 లక్షల మంది విద్యార్థుల వివరాలను ఆధార్ కింద నమోదు చేయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాఠశాలల్లో చదివే 6 నుంచి 14 ఏళ్ల వయసు వారే కాకుండా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి, అలాగే 0-6 ఏళ్ల వయసు వారికి కూడా ఆధార్ ఉండేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఆరేళ్లలోపు వయసున్న పిల్లలకు ఆధార్ ఉండేలా చూడాల్సిన బాధ్యతను మహిళా, శిశు సంక్షేమ శాఖకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అప్పగించింది.
అయితే ఆరేళ్లలోపు పిల్లలకు సంబంధించి కేవలం వారి తల్లిదండ్రులతో పిల్లలను ఫొటో తీయించి నమోదు చేయించేలా వెసలు బాటు కల్పించింది. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వారికి మాత్రం ఆధార్ నిబంధనల ప్రకారమే నమోదు చేయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇంట ర్మీడియెట్, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే అందరికీ ఆధార్ ఉన్నందున ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఆధార్ ఉండేలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని డిసెంబరులోగా పూర్తి చేసి, వివరాలను కేంద్రానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది.
ఆ వివరాల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరంలో పథకాలకు నిధుల కేటాయింపు ఉండే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో పలు విద్యా కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా పథకాలకు నిధులను విడుదల చేసేందుకు చేస్తున్న కసరత్తులో భాగంగా విద్యార్థుల సంఖ్యను కచ్చితంగా తీసుకోవాలన ్న ఆలోచనతో ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రాలు ఇస్తున్న డైస్ డాటా ఆధారంగా నిధులను ఇస్తోంది.
అయితే అనేక రాష్ట్రాలు విద్యార్థుల వాస్తవ సంఖ్య కంటే 15 శాతం నుంచి 20 శాతం వరకు ఎక్కువ సంఖ్యను చూపిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కచ్చితమైన సంఖ్యనే తీసుకోవాలని, ఇందుకు ఆధార్ ఒక్కటే సరిగ్గా ఉంటుందనే ఆలోచనతో ఈ దిశగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆధార్ తప్పనిసరి కాకపోయినా విద్యార్థుల కచ్చితమైన లెక్క తేలాలంటే ఆధార్ ద్వారానే సాధ్యం అవుతుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల వివిధ రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతోనూ ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఆధార్‌కు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.
మరో 40 లక్షల మందికి ఆధార్
రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు 43,861 పాఠశాలల్లో 59,54,376 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో దాదాపు 18 లక్షల మందికి ఆధార్ నంబర్లు ఉన్నట్లు విద్యాశాఖ ఇప్పటివరకు లెక్కలు తేల్చింది. మరో లక్షకు పైగా విద్యార్థులకు కూడా ఆధార్ ఉన్నట్లు భావిస్తోంది. ఆ లెక్కలను సేకరిస్తోంది. మిగతా 40 లక్షల మందికి ఆధార్ కింద నమోదు చేయించుకునేలా కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆధార్ విభాగం పాఠశాలల్లో ప్రత్యేకంగా క్యాంపులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది.