పీఠం కదులుతోంది!
తెరపైకి జెడ్పీ చైర్మన్ మార్పు
– పావులు కదుపుతున్న టీడీపీలోని ఓ వర్గం
– స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించలేదని మరో వర్గం ఫిర్యాదు
– జెడ్పీ పీఠంపై పలువురి గురి
- అధికార పార్టీలో కొత్త ముసలం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా పరిషత్ చైర్మన్‌గిరి మరోసారి రచ్చకెక్కుతోంది. ఇప్పటికే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు చేరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్‌గా ఉండాలనే అంశాన్ని ఓ వర్గం తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు సహకరించలేదని నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చైర్మన్‌గా ఆయన్ను తొలగించాలని అధికార పార్టీలోని మరో వర్గం కోరుతోంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు వైస్–చైర్మన్ పుష్పావతి విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. తమకు ఎన్నికల్లో సహకరించనందుకు ఆయన్ను తొలగించాలని మరో వర్గం కోరుతోంది. ఈ ఇరువర్గాల టార్గెట్ కూడా జెడ్పీ చైర్మన్ కావడంతో ఆయన తొలగింపు లాంఛనమేనన్న చర్చ సాగుతోంది. అయితే, కేవలం పుష్పావతే కాకుండా.. పలువురు జెడ్పీటీసీలు కూడా రేసుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
అనంత మార్పిడి తర్వాత..!
వాస్తవానికి కర్నూలు జెడ్పీ చైర్మన్ పీఠంపై టీడీపీలోని ఒక వర్గం ఎప్పటి నుంచో కన్నేసింది. ఇందులో భాగంగా అధికార పీఠాన్ని చెరో రెండున్నర సంవత్సరాల పాటు పంచుకుందామనే ఒప్పందం ఉందని కూడా ఈ వర్గం పేర్కొంటోంది. ఆ ప్రకారం తమకు ఇప్పటికే పీఠం దక్కాల్సి ఉందనేది వీరి వాదన. ఇందుకోసం ఒప్పందం అమలు చేయాలంటూ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎంపీ టీజీ వెంకటేష్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌లతో జిల్లాలోని ఎమ్మెల్యేలందరినీ ఈ వర్గం నేతలు కలిసి విన్నవిస్తున్నారు. తమకు చైర్మన్ పీఠం దక్కేందుకు సహకరించాలని కోరుతున్నారు. అయితే, ఇన్ని రోజులుగా ఈ వ్యవహారం అంతకు మించి ముందుకు కదల్లేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి సహకరించలేదనే ఫిర్యాదులు కూడా చైర్మన్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్పు తప్పదనే ధీమా వైరివర్గంలో వ్యక్తమవుతోంది. అనంతపురం జిల్లాలో కూడా జెడ్పీ చైర్మన్ పీఠం మార్పు చేయనున్నారని.. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే కర్నూలు జిల్లాలోనూ మార్పు తప్పకుండా జరుగుతుందని ఈ వర్గం నొక్కిచెబుతోంది.
అందని ఆహ్వానం
తన పీఠానికి వచ్చిన ఇబ్బంది లేదని చైర్మన్ ధీమాగా చెబుతున్నప్పటికీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే చైర్మన్‌కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పీఠాన్ని గెలుచుకున్న తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలతో పాటు ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్‌కు కనీసం ఆహ్వానం కూడా అందలేదని తెలిసింది. జిల్లాలోని నేతలందరినీ పిలిచిన జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి.. చైర్మన్‌ను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని సమాచారం. అంతేకాకుండా తనకు చైర్మన్ సహకరించలేదని కూడా నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ పీఠానికి ఎసరు తప్పదనే ప్రచారం అధికార పార్టీలో జరుగుతోంది. ఏదేమైనప్పటికీ జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠం వ్యవహారం ఇప్పుడు అధికారపార్టీలో కొత్త వార్‌కు తెరలేపిందని చెప్పవచ్చు.