టీడీపీ, బీజేపీ మధ్య రహస్య ఎజెండా
టీడీపీ, బీజేపీ మధ్య రహస్య ఎజెండా
Published Sun, Sep 11 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
– కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్–44పై ఆందోళన
– పాల్గొన్న పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి
కర్నూలు సిటీ: టీడీపీ, బీజేపీ మధ్య రహస్య ఎజెండా ఏదో ఉందని.. అందువల్లే హోదాపై బాబు వెనక్కు తగ్గారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్యాకేజీ వస్తే కాంట్రాక్టుల పేరిట టీడీపీ నేతలకు దోచిపెట్టే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మొదటి నుంచి అదే పాట పాడుతున్నాడని విమర్శించారు. విభజన బిల్లులో హోదా విషయం ఎందుకు పెట్టలేదనే విషయాన్ని ఆనాడు బీజేపీ ఎందుకు కోరలేదని.. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ, బీజేపీలు కాంగ్రెస్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. గతంలో 11 రాష్ట్రాల విభజనలు జరిగిన సమయంలోనే జాతీయ అభివద్ధి మండలి ఆమోదం, కేంద్ర కేబినెట్ తీర్మానాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుపతి సభలో కాంగ్రెస్ పార్టీ హోదా ఐదేళ్లు ఇస్తామంటుందని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని బీజేపీ నేతలు చెప్పగా, కాదు కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు కోరిన మాటలను ఓసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఇస్తామని చెప్పినవే ఇవ్వలేమని మాట మార్చిన మీరు.. చెప్పనివి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. సీఎం తన తీరు మార్చుకోకపోతే ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు వస్తాయన్నారు. బాబుకు ప్రతిపక్ష పార్టీలు అంటే లెక్క లేకుండా పోయిందన్నారు. హోదా విషయంలో అన్ని పార్టీలను కలుపుకుపోదామనే భావనే ఆయనకు లేదన్నారు. హోదా సాధించే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Advertisement
Advertisement