పది జవాబు పత్రాలకు భద్రత కరువు
పది జవాబు పత్రాలకు భద్రత కరువు
Published Tue, Mar 28 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
-సెక్యూరిటీ లేకుండానే తరలింపు
-ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
జూపాడుబంగ్లా: పదోతరగతి ప్రశ్నపత్రాలను పటిష్టబందోబస్తు మధ్య పోలీసుస్టేషన్‌లకు తరలించి భద్రపర్చే అధికారులు జవాబు పత్రాల తరలింపు విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. జూపాడుబంగ్లాలోని రెండు పరీక్ష కేంద్రాలలో 443 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలను రాస్తున్నారు. వారు రాసిన జవాబు పత్రాలను స్పీడ్‌పోస్టు ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలి. స్పీడ్‌పోస్టు సౌకర్యం జూపాడుబంగ్లాలో లేకపోవటంతో నందికొట్కూరుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్పీడ్ పోస్టుచేస్తున్నారు.
నందికొట్కూరు వరకు తీసుకెళ్లేందుకు పోలీసుల బందోబసు్త ఉండాలి. అయితే ఎలాంటి పోలీసు ప్రొటెక‌్షన్ లేకుండా జవాబు పత్రాలను పరీక్షాకేంద్రాల చీఫ్‌లు యథేచ్ఛగా వారి ఇష్టారాజ్యంగా బస్సులు, ఆటోల్లో తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఎక్కడైనా జవాబు పత్రాలు తారుమారైనా, మిస్‌అయినా అందుకు బాధ్యత ఎవ్వరు వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జూపాడుబంగ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం చీఫ్ విజయభాస్కర్‌ను ప్రశ్నించగా వాస్తవంగా పదోతరగతి పరీక్షల జవాబు పత్రాలను పోలీసు ప్రొటెక‌్షన్‌తోనే తరలించాలి. అయితే తగినంత పోలీసు సిబ్బంది లేరనే కారణంతో వారు రావటం లేదు. దీంతో మేమే బస్సుల్లో జవాబుపత్రాలను నందికొట్కూరుకు తీసుకెళ్లి అక్కడి నుంచి స్పీడ్‌పోస్టుచేస్తున్నట్లు తెలిపారు.
Advertisement