‘యాప్’తో కాపలా..
- దొంగలకు పోలీసుల సాంకేతిక ముకుతాడు
– లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌తో ఇళ్లకు భద్రత
– యాప్ ఉన్న ఇంట్లోకి దొంగలు పడితే పోలీస్ స్టేషన్‌లో సైరన్
– సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌కు యాప్ అనుసంధానం
– ఇళ్ల దొంగతనాల నివారణకు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొండి
– జిల్లా పోలీసు శాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం
కర్నూలు: ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లాలనుకుంటున్నారా... దొంగల భయంతో ఇంత కాలం హడలి పోయారా... ఏళ్లపాటు కష్టపడి దాచుకున్న సొమ్మును దొంగలు దోచుకు పోతారన్న భయంతో ఇబ్బంది పడ్డారా... ఇకపై అలాంటి భయమేమీ అవసరం లేదు. మీరు చేయాల్సిందంతా ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేటపుడు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడమే తరువాయి... మీరు తిరిగి ఇంటికొచ్చే వరకు ఎన్ని రోజులైనా భద్రత కల్పించే సరికొత్త కార్యక్రమానికి జిల్లా పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. లాక్‌డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఇళ్లకు భద్రత కల్పించి దొంగలకు ముకుతాడు వేసే కార్యక్రమం అమలులోకి తెస్తున్నారు. ముందుగా కర్నూలు, నంద్యాలలో లాక్‌డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను అమలు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాల్లో అమలు చేసేందుకు కార్యచరణ రూపొందించారు. తాళం వేసిన ఇళ్ల సమాచారం అందిన వెంటనే ఇళ్లపై యాప్‌తో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి నిఘా వేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. అనుమానితులు ఇంట్లోకి వెళితే యాప్ కెమెరా ఫొటో స్నాప్ షాట్స్, వీడియో రికార్డింగ్, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడమెలా:
ఆండ్రాయిడ్ ముబైల్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌తో ఇంటి అడ్రస్సుతో పాటు సెల్ నెంబరు పొందు పరిచి నివాసం ఉండే ఇంటి నుంచే రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీ నెంబరుతో యూజర్ ఐడీ వస్తుంది. ఊళ్లకు కానీ, యాత్రలకు కానీ, సొంత పనులపై బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు యూజర్ ఐడీతో యాప్‌లోని పోలీసు రిక్వెస్ట్ వాచ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం అందించిన ఇళ్లపై పోలీసు రిక్వెస్ట్ వాచ్ ఉంటుంది. పలానా రోజు నుంచి పలానా రోజువరకు ఊళ్లకు వెళ్తున్నామని పోలీసులకు తెలియజేయాలి. వెళ్లే ముందు ఇంటి పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే పోలీసులు సంబంధిత ఇంటికెళ్లి ఇంటి లోపల వైఫై కెమెరా మోడం అతికించి పెడతారు. అప్పటి నుంచి తిరిగి వచ్చే సమయం వరకు ఆ ఇళ్లు పోలీసు నిఘాలో ఉంటుంది.
ఎవరైనా అనుమానితులు ఇంటిలోకి వెళితే తక్షణమే సంబంధిత స్టేషన్‌కు సమాచారం చేరుతుంది. బీట్ కానిస్టేబుల్ వెంటనే నిఘా ఉంచి దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఈ విధానం దోహదపడుతుంది. లాక్‌డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ అమలుపై సంబంధిత టెక్నిషియన్లతో జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఎస్పీ ఆకె రవికృష్ణ ముఖ్య అతిధిగా హాజరై యాప్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్షావలి, డీఎస్పీలు రమణమూర్తి, బాబూ ప్రసాద్, హరినాథరెడ్డి, సీఐ ములకన్న, ఈ–కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, ఎస్‌ఐలు, వివిధ పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.