విత్తన గిడ్డంగి
- దీని నిల్వ సామర్థ్యం 28వేల క్వింటాళ్లు
- నిర్మాణ వ్యయం రూ.3.08 కోట్లు
- నిర్మాణం తుది దశలో విత్తన శుద్ధి కర్మాగారం
- ఈ రెండింటిని 17న ప్రారంభించనున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం
ఖమ్మం వ్యవసాయం: అధునాతన సాంకేతిక పరిఙ్ఞానంతో ఖమ్మం నగరానికి సమీపంలోగల రఘునాథపాలెం వద్ద 2.24 ఎకరాల స్థలంలో రూ.3.05 కోట్ల వ్యయంతో విత్తన గిడ్డంగిని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్మించింది. దీని నిల్వ సామర్థ్యం 28వేల క్వింటాళ్లు. ఈ స్థలంలోనే కోటి రూపాయల వ్యయంతో చేపట్టిన విత్తన శుద్ధి కర్మాగార నిర్మాణం కూడా తుది దశకు చేరింది. పత్తి, మిర్చి, కూరగాయలు మినహా జిల్లాలో పండించే అన్ని రకాల పంట ఉత్పత్తులను విత్తనాల కోసం కొనుగోలు చేసి (విత్తన) ఇక్కడే శుద్ధి చేసి, నిల్వ ఉంచుతారు. జిల్లాకు అవసరమైన విత్తనాలను ఇప్పటివరకూ పొరుగు జిల్లాలైన వరంగల్, కరీంనగర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇకపై విత్తనాలను ఇక్కడి నుంచే పొందవచ్చు. విత్తన శుద్ధి కేంద్రంలో ‘పోలార్ వెస్ట్రబ్’ అనే అధునాతనమైన విత్తన శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం ఆరు టన్నులు. రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ అందిస్తుంది. ఆ రైతులు పండించిన పంటను కార్పొరేషన్ పరిశీలించి, ప్రమాణాల ప్రకారం ఉన్నవాటిని కొనుగోలు చేసి విత్తనాలుగా మారుస్తుంది. వీటిని ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ధరకు తిరిగి రైతులకు అందిస్తుంది. గిడ్డంగిని, కర్మాగారాన్ని ఈ నెల 17న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ కె.కోటిలింగం ‘సాక్షి’తో చెప్పారు.