విభజనహోరు
విభజనహోరు
Published Thu, Aug 8 2013 1:05 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
సాక్షి, మచిలీపట్నం: తెలుగుతల్లి బిడ్డలను విడదీస్తే ఊరుకోమంటూ మచిలీపట్నంలో ఆందోళనలు హోరెత్తాయి. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, గ్రంథాలయ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీలతో పట్టణం పోటెత్తింది. పలువురు హిజ్రాలు ర్యాలీల్లో నృత్యాలు చేస్తూ ఉద్యమానికి మద్దతు పలికారు. మునిసిపల్ క్లాస్-4 సిబ్బంది విచిత్రవేషాలతో ప్రదర్శనలిచ్చి ర్యాలీల్లో పాల్గొన్నారు. లక్ష్మీటాకీస్, కోనేరుసెంటర్లలో విద్యార్థినులు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రంగవల్లులు వేశారు. నందిగామలో న్యాయవాదులు, ఐసీడీఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్వర్యంలో మైలవరంలో భారీ ర్యాలీ జరిగింది. ఉయ్యూరులో సంపూర్ణ బంద్ పాటించారు. వేలాదిమంది విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సమైక్యవాదులు ఉయ్యూరు ప్రధాన సెంటరును దిగ్బం ధించారు. రైతులు ఎడ్లబళ్లతో ప్రదర్శన చేశారు. రోడ్డుపై వ్యాపారులు వంట కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. పోరంకి సెంటర్‌లో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త సురేష్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. కానూరు సిద్ధార్థ లా కళాశాల వద్ద కొనసాగుతున్న రిలే దీక్షాశిబిరాన్ని అదే పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తాతినేని పద్మావతి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి మద్దతు తెలిపారు.
కంకిపాడులో బ్రాహ్మణ సమితి ఆధ్వర్యంలో మహాశాంతియాగం నిర్వహించారు. గుడివాడలో మునిసిపల్ ఉద్యోగులు రోడ్లపైనే వంట వండారు. నడిరోడ్డుపై నాట్లు వేశారు. టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. జగ్గయ్యపేటలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ విద్యార్థులు, ముస్లిం సోదరులు మానవహారం ఏర్పాటుచేశారు. నందిగామ నియోజకవర్గంలో పాఠశాలలు మూతపడ్డాయి. నూజివీడులో మున్సిపల్ ఉద్యోగులు చిన్న గాంధీబొమ్మ సెంటరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగంచిప్రోలులో కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి స్థానిక పోలీస్ స్టేషన్ సెంటర్‌లో దహనసంస్కారాలు నిర్వహించారు. గన్నవరం మండలంలోని ముస్తాబాద, గొల్లనపల్లి, చినఆవుటపల్లి గ్రామాల్లో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి.
బెజవాడలో...
కాళేశ్వరరావు మార్కెట్ వద్ద వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటుచేశారు. ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. భవన నిర్మాణ కార్మికులు, వడ్డెరలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాఘవయ్య పార్క్ జంక్షన్‌లో మానవహారం చేపట్టారు. ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరో ర్యాలీ తీశారు.
వైద్యులు, వైద్య ఉద్యోగులు గంటసేపు విధులు బహిష్కరించి ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఉద్యోగులు మూడోరోజూ విధులు బహిష్కరించారు. భవానీపురం స్వాతి థియేటర్ సెంటర్‌లో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. బందర్‌రోడ్డులో ఆటో ర్యాలీ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు, సిబ్బందికి సమైక్యాంధ్రపై ఎన్జీవో నాయకులు అవగాహన కల్పించారు. విజయవాడ సినీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సినిమా థియేటర్లలో అన్ని ఆటలు రద్దుచేశారు.
Advertisement
Advertisement