ఎట్టకేలకు..
సిద్దిపేట జోన్ : స్వయం సహాయక సంఘాల మహిళల్లోని అభయహస్తం లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. సంవత్సర కాలంగా అభయహస్తం పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు ఫలించాయి. తొమ్మిది నెలల బకాయిలను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 5290 లబ్ధి్దదారులకు సంబంధించిన రూ.2.36 కోట్లు విడుదల అయ్యాయి. సోమవారం నుంచి పంపిణీ ప్రక్రియకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) అధికారులు శ్రీకారం చుట్టారు. కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలో సెర్ఫ్ ఆధ్వర్యంలో అభయహస్తం పంపిణీ పక్రియ జరిగింది. డ్వాక్రా సంఘాల్లోని 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళలు రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.30 పొదుపు రూపంలో జమచేసుకోవాలి. 58 సంవత్సరాల తర్వాత పొదుపు చేసిన మొత్తం ఆధారంగా అభయహస్తం లబ్ధిదారురాలికి రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకు పింఛన్ రూపంలో ప్రతి నెల ప్రభుత్వం అందిస్తుంది. అయితే, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత యేడు జనవరి నుంచి అభయహస్తం పింఛన్లు నిలిచిపోయాయి.
వేలాదిమందికి ఊరట
రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం బకాయిలను విడుదల చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2016–17 ఆర్ధిక సంవత్సరానికి పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సంబంఅభయ హస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వాటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడం సంబంధిత శాఖకు నిధులు చేరడంతో సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అభయహస్తం పింఛన్ల పంపిణీ ప్రక్రియను సెర్ఫ్ అధికారులు చేపట్టారు. ఈ లెక్కన జిల్లాలోని 22 మండలాలతో పాటు, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక పట్టణాలకు చెందిన 5290 మంది లబ్ధిదారులకు రూ.2.36 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో అత్యధికంగా కొహెడ మండలంలోని 441 మందికి రూ.19 లక్షలు, చేర్యాల మండలంలో 408మందికి రూ.18లక్షలు, చిన్నకోడూరు మండలంలో 358 మందికి రూ.15 లక్షలు, బెజ్జంకిలో 333 మందికి రూ.14లక్షలు, దుబ్బాకలో 287 మందికి రూ.12 లక్షలు, హుస్నాబాద్‌లో 346 మందికి రూ. 15 లక్షలు, నంగునూరులో 373 మందికి రూ.16లక్షలు, సిద్దిపేట పట్టణంతో పాటు, అర్బన్, సిద్దిపేట మండలంలో 617 మందికి రూ.30 లక్షలు మొత్తంగా జిల్లాలో రూ.2.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న లద్ధిదారులకు సర్కార్ నిర్ణయం కొంత ఊరటను కలిగించింది. నిధులు విడుదల చేసిన విషయం వాస్తవమేనని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సత్యనారాయణరెడ్డి ధ్రువీకరించారు.