Serfs officials
-
చీకటి వెలుగులు
ఒంగోలు టూటౌన్: జిల్లాలోని వెలుగు (సెర్ఫ్) ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం ఒంగోలులోని ప్రగతి భవనంలోని డీఆర్డీఏ–వెలుగు కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం ప్రగతి భవనం మెట్లపై నిరసనకు దిగారు. సెర్ఫ్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలని నినదించారు. వెలుగులో పని చేసే ఉద్యోగులందరనీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెలుగు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు నరేంద్రకుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వెలుగు–డీఆర్డీఏ శాఖలో అతి తక్కువ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నామన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా అలవెన్సులు పెంచాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హెచ్ఆర్ లేని ఉద్యోగులందరికీ హెచ్ఆర్ వర్తింపచేయాలన్న విన్నపాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దీంతో తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెబాట పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చి తమ తమ సమస్యలు పరిష్కరించే వరకు దశల వారి ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే సెర్ఫ్ సీఈవోకి రాష్ట్ర జేఏసీ తరుపున సమ్మె నోటీసు కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమ్మెలో వెలుగు(సెర్ఫ్) ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు డీపీఎం, ఏపీఎం, సీసీ, ఎంసీసీలు, సపోర్టింగ్ సిబ్బంది అందరూ సమ్మెలో పాల్గొన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌కు సమ్మెకు సంబంధించిన వినతిపత్రం ఇచ్చారు. హామీ అమలు చేయలేదనే సమ్మెబాట.. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత వెలుగు (సెర్ఫ్)ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో కూడా ఈ విషయం చేర్చారు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ ఊసే ఎత్తలేదు. సీఎం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంతో సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని వెలుగు ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు నరేంద్రకుమార్ తెలిపారు. సమస్య పరిష్కారమయ్యే వరకు దశల వారీగా ఆందోళన కొనసాగిస్తామన్నారు. నేడు ర్యాలీ, మానవహారం.. జిల్లా కేంద్రంలో గురువారం ప్రగతి భవనం నుంచి కలెక్టరేట్ వరకు వెలుగు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిమని తెలిపారు. అనంతరం చర్చి సెంటర్ నందు మానవ హరం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు. 7 నుంచి నిరాహార దీక్షలు... ఈనెల 7వ తేదీ (శుక్రవారం) నుంచి సెర్ఫ్ ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టనున్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకైనా వెనుకాబోమని సెర్ఫ్ (వెలుగు) ఉద్యోగుల సంఘం మీడియా కో–ఆర్డినేటర్ (డీపీఎం) పి.డేవిడ్ హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను ఉధృతం చేస్తామని, తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగులు, నాయకులు ప్రతినబూనారు. -
ఎట్టకేలకు..
సిద్దిపేట జోన్ : స్వయం సహాయక సంఘాల మహిళల్లోని అభయహస్తం లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. సంవత్సర కాలంగా అభయహస్తం పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు ఫలించాయి. తొమ్మిది నెలల బకాయిలను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 5290 లబ్ధి్దదారులకు సంబంధించిన రూ.2.36 కోట్లు విడుదల అయ్యాయి. సోమవారం నుంచి పంపిణీ ప్రక్రియకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) అధికారులు శ్రీకారం చుట్టారు. కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలో సెర్ఫ్ ఆధ్వర్యంలో అభయహస్తం పంపిణీ పక్రియ జరిగింది. డ్వాక్రా సంఘాల్లోని 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన మహిళలు రోజుకు రూపాయి చొప్పున నెలకు రూ.30 పొదుపు రూపంలో జమచేసుకోవాలి. 58 సంవత్సరాల తర్వాత పొదుపు చేసిన మొత్తం ఆధారంగా అభయహస్తం లబ్ధిదారురాలికి రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకు పింఛన్ రూపంలో ప్రతి నెల ప్రభుత్వం అందిస్తుంది. అయితే, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత యేడు జనవరి నుంచి అభయహస్తం పింఛన్లు నిలిచిపోయాయి. వేలాదిమందికి ఊరట రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం బకాయిలను విడుదల చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2016–17 ఆర్ధిక సంవత్సరానికి పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సంబంఅభయ హస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వాటికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడం సంబంధిత శాఖకు నిధులు చేరడంతో సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అభయహస్తం పింఛన్ల పంపిణీ ప్రక్రియను సెర్ఫ్ అధికారులు చేపట్టారు. ఈ లెక్కన జిల్లాలోని 22 మండలాలతో పాటు, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక పట్టణాలకు చెందిన 5290 మంది లబ్ధిదారులకు రూ.2.36 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో అత్యధికంగా కొహెడ మండలంలోని 441 మందికి రూ.19 లక్షలు, చేర్యాల మండలంలో 408మందికి రూ.18లక్షలు, చిన్నకోడూరు మండలంలో 358 మందికి రూ.15 లక్షలు, బెజ్జంకిలో 333 మందికి రూ.14లక్షలు, దుబ్బాకలో 287 మందికి రూ.12 లక్షలు, హుస్నాబాద్‌లో 346 మందికి రూ. 15 లక్షలు, నంగునూరులో 373 మందికి రూ.16లక్షలు, సిద్దిపేట పట్టణంతో పాటు, అర్బన్, సిద్దిపేట మండలంలో 617 మందికి రూ.30 లక్షలు మొత్తంగా జిల్లాలో రూ.2.36 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న లద్ధిదారులకు సర్కార్ నిర్ణయం కొంత ఊరటను కలిగించింది. నిధులు విడుదల చేసిన విషయం వాస్తవమేనని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సత్యనారాయణరెడ్డి ధ్రువీకరించారు.