వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి | Seven people died in different road accidents | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

Published Sat, Jun 3 2017 1:15 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి - Sakshi

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సోమవారం ఏడుగురు మృతిచెందారు. చివ్వెంల మండలంలో నలుగురు, భువనగిరిలో ఒకరు.. హాలియాలో ఒకరు, గుర్రంపోడు మండలంలో మరొకరు మృతిచెందగా .. పలువురు గాయపడ్డారు...
చివ్వెంల(సూర్యాపేట): అప్పటి ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసి ఆనందంగా గడిపిన వారిని ఆగిఉన్న లారీ మృత్యువు రూపంలో కభళించింది. చివ్వెంల మండల పరిధిలోని జి.తిర్మలగిరి వద్ద విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి  ఆగిఉన్న లారీని కారు వెనుకనుంచి ఢీ కొనడంతో ముగ్గురు దుర్మణం పాలై మరొకరు మృత్యువుతో పోరుడుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండపాలెం ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్‌(26), అతని బావమరిది పాత గుంటూరుకు చెందిన తొర్రసాయి కోటేష్‌(24), కోటేష్‌ బావమరిది తెనాలి మండలం పినుపాలెం గ్రామానికి చెందిన మైలా పూర్ణచందర్‌రావు(21)తోపాటు పాత గుంటూరుకు చెందిన దాది సాయిభార్గవ్‌ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లారు. మ్యాచ్‌ చూసి తిరిగి కారులో వస్తుండగా.. చివ్వెంల మండలం జి.తిర్మలగిరి గ్రామ శివారులో హైవే పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో కారు డ్రైవింగ్‌ చేస్తున్న శ్రీకాంత్‌ అక్కడిక్కడే మృతిచెం దాడు.

కోటేష్, పూర్ణచందర్, సాయిభార్గవ్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి కోటేష్, పూర్ణచందర్‌ మృతి చెందారు. సాయిభార్గవ్‌ పరిస్థితి కూడా ఉందని వైద్యులు తెలిపారు. కాగా వీరిలో ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌ ఆదివారం సాయంత్రం విమానంలో హైదరాబాద్‌ వెళ్లి, తిరుగు ప్రయాణంలో కారులో వస్తున్నట్లు బంధువులు తెలిపారు. కోటేష్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. శ్రీకాంత్‌కు భార్య, కూతురు ఉన్నారు. పూర్ణచందర్‌ బీటెక్‌ చదువుతున్నాడు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట రూరల్‌ సీఐ ప్రవీన్‌కుమార్, ఎస్‌ఐ బి.ప్రవీన్‌కుమార్‌ సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కోటేష్‌ తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.

కారు ఢీకొని మహిళ..
భువనగిరిఅర్బన్‌: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని జమ్మాపురం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జమ్మాపురం గ్రామానికి చెందిన గంగారపు ఆరోగ్యజ్యోతి(38), ఆమె అన్న కుమార్తె మేరిస్టేల్లాతో కలిసి స్కూటీ బస్‌షెల్టర్‌కు సమీపంలో ఉన్న తమ మామిడి తోటకు వెళ్లారు.

తిరిగి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటే క్రమంలో వీరి బైకును హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఇరువురు రోడ్డుపై పడ్డారు. ప్రమాదంలో ఆరోగ్యజ్యోతి అక్కడిక్కడే మృతి చెందింది. మేరిస్టేల్లాకు తీవ్ర గాయాలు కావడంతో  చికిత్స నిమిత్తం భువనగిరిలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యజ్యోతి అన్న గంగారపు మల్లయ్య రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

లారీ ఢీకొని ఒకరు..
గుర్రంపోడు(నాగార్జునసాగర్‌): బైక్‌ను లారీ ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పాల్వాయి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ జి.ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్‌ మండలం ఎం.గౌరారం గ్రామానికి చెందిన మాడ్గుల కమలాకర్‌(24) పీఏపల్లి మండలకేంద్రానికి తన బంధువుల ఇంటికి  వెళ్లి తిరిగి వస్తుండగా పాల్వాయి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కమలాకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కమలాకర్‌ తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు. కమలాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

లారీని తప్పించబోయి కానిస్టేబుల్‌..
చివ్వెంల(సూర్యాపేట): రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కుడకుడ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పబ్బతి శ్రీనాథ్‌(43) ఆదివారం విధులు ముగించుకుని ఆయన స్వగ్రామం నూతన్‌కల్‌కు బైక్‌పై బయలుదేరాడు.

మార్గమధ్యంలో మండల పరిధిలోని కుడకుడ గ్రామ శివారులో దంతాలపల్లి–సూర్యాపేట రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి.. కిండపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని సూర్యాపేట ఎస్పీ పరిమళహన నూతన్, డీఎస్పీ సునీతామోహన్, సీఐ మొగిలయ్య, ఎస్‌ఐ బి.ప్రవీన్‌కుమార్‌ సందర్శించారు. శ్రీనాథ్‌కు భార్య మాధవి, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.  

బస్సు ఢీకొని ఒకరు..
హాలియా(నాగార్జునసాగర్‌): ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మదారిగూడెం గ్రామానికి చెందిన మద్దెల సైదులు(30) ఆదివారం పెద్దవూర మండలం తమ్మడపల్లి గ్రామంలో శుభకార్యానికి వెళ్లి రాత్రి బైక్‌పై తిరిగి హాలియాకు వస్తున్నాడు.

ఈ క్రమంలో ఈశ్వర్‌నగర్‌ వద్ద బైక్‌ రాయిని ఎక్కి పక్కకు వెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న దేవరకొండ డిపోకు చెందిన బస్సు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సైదులు అక్కడికక్కడే మృతి చెందాడు. సైదులు భార్య శ్రవంతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ వెంకట్‌ తెలిపారు. సైదులుకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement