
ఉద్యోగినులపై లైంగిక వేధింపులు!
కార్వే (హెచ్‌ఆర్‌సీ)లో పనిచేస్తున్న ఉద్యోగినులపై సంస్థ క్యాషియర్ ఆర్.రమేష్‌బాబు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఉద్యోగినులు ఆరోపించారు.
రాజమహేంద్రవరం క్రైం : కార్వే (హెచ్‌ఆర్‌సీ)లో పనిచేస్తున్న ఉద్యోగినులపై సంస్థ క్యాషియర్ ఆర్.రమేష్‌బాబు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఉద్యోగినులు ఆరోపించారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ ఉద్యోగినులు కె.రేవతి, డి.లక్ష్మి, వి.శ్రీదేవి, పీఎస్ లక్ష్మి తదితరులు ఈ వివరాలు చెప్పారు. రాజమహేంద్రవరంలోని పూర్వపు జయరామ్ థియేటర్‌లో కార్వే అనుబంధ సంస్థ అయిన హెచ్‌ఆర్‌సీ(హైదరాబాద్ రేస్ కోర్స్) రేస్ క్లబ్ నిర్వహిస్తోంది.
ఇందులో నిరుపేద కుటుంబాలకు చెందిన, దళితులైన సుమారు 20 మంది ఉద్యోగినులు కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. సంస్థ క్యాషియర్ ఆర్.రమేష్‌బాబు వారిని లైంగికంగా వేధించడమే కాకుండా, కొందరిని లొంగదీసుకున్నాడు. అతని చర్యలు తాళలేక కొందరు ఉద్యోగాలు మానేశారు. కుటుంబాన్ని పోషించడం కోసం, గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు ఉద్యోగినులు అతడి వికృత చేష్టలను భరించారు. రోజురోజుకూ అతడి ఆగడాలు హద్దు మీరుతుండడంతో ఇతడిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, రూ.20 వేలు లంచంగా ఇచ్చి కేసు లేకుండా తప్పించుకున్నాడు.
అతడి లైంగిక వేధింపులపై హైదరాబాద్‌లోని కార్వే సంస్థ ప్రతినిధులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెడ్ ఆఫీస్ నుంచి విచారణకు అక్కడి ఇన్‌చార్జ్ సురేష్‌ను పంపించారు. అతడికి క్యాషియర్ రమేష్ సన్నిహితుడు కావడంతో.. విచారణ పేరుతో వారు ఫిర్యాదుదారులనే బెదిరించారు. అనివార్య పరిస్థితుల్లో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అతడి నుంచి తమకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఫిర్యాదు ఈరోజే అందింది
కాగా ఈ విషయమై త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావును వివరణ కోరగా, దీనిపై ఆదివారమే బాధితుల నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. అంతవరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదని, లంచం తీసుకున్నట్టు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.