షేమ్...షేమ్!
సాక్షి ప్రతినిధి, కడప:
అధికారం ముందు హోదాలు బలాదూర్ అవుతున్నాయి. వేదిక ఏదైనా తెలుగుతమ్ముళ్లు ఆశీనులవుతున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులను, అధికారులను విస్మరిస్తున్నారు. ప్రోటోకాల్ విస్మరిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం కలెక్టర్ సాక్షిగా
ఉన్నతాధికారులు ఘోర పరాభవం చవిచూశారు. టీడీపీ నేతల ముందు కమిషనర్, డీఈఓ చేతులు కట్టుకొని నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఏకంగా ఇన్‌చార్జి మంత్రి సమక్షంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయస్థాయి పోటీపరీక్షలకు సన్నద్ధం చేసేందుకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం మున్సిపల్ హైస్కూల్స్‌లో ఐఐటీ, నీట్ కెరీర్ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెట్టారు. శుక్రవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లో ఈ కార్యక్రమాన్ని మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ ఉద్దేశాన్ని మంత్రి వివరించారు. కాగా అధికారిక కార్యక్రమంలో అధికారులకు చోటు దక్కకపోగా టీడీపీ నేతలు మూకుమ్మడిగా తిష్టవేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, సురేష్‌నాయుడు, హరిప్రసాద్, దుర్గాప్రసాద్‌లు వేదికపై ఆశీనులయ్యారు. వీరంతా కలెక్టర్ కేవీ సత్యనారాయణ, మంత్రి గంటా చెంతన కూర్చొని ఉండగా కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, డీఈఓ ప్రతాపరెడ్డి, హెచ్‌ఎం సుబ్బారెడ్డిలు నిల్చోవాల్సి వచ్చింది. సాక్షాత్తు మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో సైతం కలెక్టర్ సాక్షిగా ప్రోటోకాల్‌కు
తిలోదాకాలిచ్చారు. కార్యక్రమం ముగిసేంత వరకూ ఉన్నతాధికారులు ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోవాల్సిన వచ్చింది.
తలాడించాల్సిన దుస్థితి
టీడీపీ నేతలు ఎవరు స్పందించినా గంగిరెద్దులా తలాండించాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ప్రోటోకాల్ ఉల్లంఘనను కలెక్టర్ నియంత్రించాల్సి ఉంది. కాగా ఇదేవిషయమై ఓ ఉన్నతాధికారి సాక్షితో మాట్లాడుతూ అవన్నీ పట్టించుకుంటే ఇక్కడ ఉద్యోగం ఉండదని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు చెప్పినట్లే ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్నా అనేక సమస్యలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారకార్యక్రమంలో సీటు దక్కకపోయినా బాధలేదు, దూషణలు లేకపోతే చాలంటూ పేర్కొనడం విశేషం. దీనిని బట్టి అధికారుల మానసిక పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు.