
సీఎం గారికో షెడ్డు!
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణం
కలెక్టర్ ఎన్.యువరాజ్ స్థలపరిశీలన
విశాఖపట్నం: రాజు తలచుకుంటే.. కాదు కాదు సీఎం తలచుకుంటే ఏదైనా జరుగుతుంది. పగటి పూట వెన్నెల విరులు కురుస్తాయి. రాత్రి సూర్యుడు వెలుగులు చిందిస్తాడు. ఏంటో ఈ విడ్డూరం అనుకోవద్దు. ఎందుకంటే అలాంటి చిత్రాలే ఇప్పుడు జరుగుతున్నాయి. విషయమేమిటంటే సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో కంటే విశాఖ నగరంలో పర్యటించిందే ఎక్కువ.
సగటున వారానికోసారి నగరంలో అడుగుపెడుతున్నారు. ఆయనతో పాటు మంత్రులూ వస్తున్నారు. పైగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా విశాఖ విమానాశ్రయంలో దిగి వెళుతున్నారు. ఎలా చూసినా సీఎం, మంత్రుల తాకిడి విశాఖకు విపరీతంగా పెరిగింది.
వారు వచ్చి నపుడల్లా నగరంలోకి వచ్చి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోవడం, కార్యకర్తలను కలుసుకోవడం వంటి పనులకు సమయం సరిపోవడం లేదంట. దీంతో బాగా ఆలోచించిన పాలకులు ఎయిర్‌పోర్టు వద్దే అలాంటి ఏర్పాట్లు ఉంటే బాగుంటుం దని భావించారు. అధికారం వారిది కాబట్టి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసేశారు. వారి ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టులో సీఎం కోసం తాత్కాలిక షెడ్ నిర్మాణానికి కలెక్టర్ ఎన్.యువరాజ్ గురువారం స్థల పరిశీలన జరిపారు. నిజానికి ఈ స్థలం నేవీ ఆధీనంలో ఉంది.
వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అధికారులు తలుచుకుంటే ఇదేమంత పెద్ద కష్టం కాదులే. అయితే అధికారపార్టీ కార్యకలాపాలకు ఎయిర్‌పోర్టును వేదిక చేసుకోవడమే విడ్డూరంగా ఉంది మరి. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న ఈ షెడ్డును అంచెలంచెలుగా విస్తరించి టీడీపీ మినీ కార్యాలయంగా మార్చనున్నట్టు సమాచారం. కార్యకర్తల సమావేశాలు, పార్టీ సమీక్షలంటూ ఎయిర్‌పోర్టులో గందరగోళం సృష్టిస్తే దేశ, విదేశీ విమాన ప్రయాణికులకు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది.