మత్తెక్కిస్తోంది.. | sheelavathi cigaret in warangal dist | Sakshi
Sakshi News home page

మత్తెక్కిస్తోంది..

Published Thu, Jul 6 2017 2:59 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

మత్తెక్కిస్తోంది..

మత్తెక్కిస్తోంది..

నగరంలో గంజాయి సిగరెట్లు
పాన్‌షాపులే విక్రయ కేంద్రాలు
రాత్రి 9 గంటల తర్వాత అమ్మకాలు
షీలావతి సిగరెట్‌కు డిమాండ్‌


వరంగల్‌ నగరంలో గంజాయి విక్రయాలు, వినియోగం జోరుగా సాగుతోంది. ప్రధాన సెంటర్లలో విచ్చలవిడిగా గంజాయి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రైలు మార్గం ద్వారా నగరానికి చేరుకుంటున్న గంజాయి.. ఆ తర్వాత సిగరెట్‌గా మారి మత్తెక్కిస్తోంది.

సాక్షి, వరంగల్‌: నగరంలోని ప్రధాన జంక్షన్లలో, ప్రముఖ విద్యా సంస్థల పరిసరాల్లో ఉన్న పాన్‌షాçపుల్లో గంజాయి విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కిలోల లెక్కన కొనుగోలు చేసిన గంజాయి పాన్‌షాపులకు చేరుతోంది. ఇక్కడ వీరు తమ కస్టమర్లకు గంజాయిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయికి అలవాటు పడిన కస్టమర్లు నిత్యం ఈ పాన్‌షాపులను సందర్శిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కాకుండా రాత్రి 9 దాటిన తర్వాత  పాన్‌షాపుల్లో గంజాయి అమ్మకాలు మొదలవుతున్నాయి. కస్టమర్ల అభిరుచి, కొనుగోలు శక్తిని బట్టి గంజాయిని రెడీమేడ్‌ సిగరెట్లు, లేదా రా మెటీరియల్‌గా అందిస్తున్నారు.

‘షీలావతి’కి డిమాండ్‌..
జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు సంబంధించిన సిగరెట్లు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో మగవారి అందాన్ని సూచించే అర్థంతో వచ్చే సిగరేట్లు గంజాయి అమ్మకాలకు అనువుగా ఉన్నాయి. మిగిలిన బ్రాండ్లకు సంబంధించిన సిగరేట్లలో గంజాయిని మిళితం చేయడం కష్టం. కానీ అందాన్ని సూచించే సిగరెట్‌లో గంజాయిని మిక్స్‌ చేయడం తేలిక. దీంతో ఈ సిగరేట్‌లో ఉన్న పొగాకు సగానికి పైగా తొలగించి దాని స్థానంలో గంజాయిని కలుపుతున్నారు. ఈ సిగరేట్‌కు కోడ్‌ భాషలో షీలావతిగా పేర్కొంటారు. ఒక్క షీలావతి సిగరేట్‌ ధర రూ.150 నుంచి రూ.200 వరకు ఉంది. రెడీమేడ్‌గా సిగరెట్‌ కావాలనుకునే వారు షీలావతిని కొనుగోలు చేస్తారు. మరికొందరు టోకుగా గంజాయి, ఫిల్టర్లు, సిగరెట్‌ను చుట్టే రిజ్లా కాగితాన్ని కొనుక్కుని తమకు ఇష్టం వచ్చినట్లు సిగరెట్లు తయారు చేసుకుంటున్నారు. ప్రారంభంలో కేవలం గంజాయి విక్రయించినా సొంత తయారీ గంజాయి సిగరేట్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో సిగరేట్‌ తయారీకి ఉపయోగించే రిజ్లా కాగితం, ఫిల్టర్లను ప్రత్యేకంగా తెప్పించి అమ్మకాలు చేస్తున్నారు. ఈ విధానంలో ధర తక్కువగా ఉండటంతో పాటు ఎవరి కంట పడకుండా గుట్టుగా తాగే అవకాశం ఉంది.

రైలు ద్వారా రవాణా..
హైదరాబాద్, విజయవాడల నుంచి నగరానికి గంజాయి వస్తోంది. గంజాయిని సరఫరా చేసే వ్యక్తులు ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మిలిటరీ ట్రంకు పెట్టెను పోలి ఉండే పెట్టెలను, బ్యాగులను ఉపయోగిస్తున్నారు. వీటిని రైలుబోగీలో తలుపులు, టాయిలెట్‌లకు సమీపంలో ఈ బ్యాగు/పెట్టెలను ఉంచుతున్నారు. వీటిని సరఫరా చేసే వ్యక్తులు మిలిటరీ కటింగ్‌ చేయించుకుని ఉంటున్నారు. దీంతో చూసేవారికి ఆర్మీలో పని చేసే వ్యక్తులుగా కనిపిస్తున్నారు. కాజీపేట, వరంగల్‌ స్టేషన్లు రాగానే గంజాయితో కూడిన బ్యాగులతో రైలు దిగి బయటకు వెళ్లిపోతున్నారు. వేషధారణ, నడవడిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఎవరికీ అనుమానం రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement