గొర్రెల కాపరి ఆత్మహత్య
గాండ్లపెంట (కదిరి) : గాండ్లపెంట మండలం రెడ్డివారిపల్లిలో రాగినేని నరసింహులు(38) అనే గొర్రెల కాపరి చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్య చేసుకోవడాన్ని బుధవారం కనుగొన్నట్లు ఎస్‌ఐ హరినాథరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. నరసింహులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారు పెళ్లీడుకువచ్చారు. పెద్ద కుమార్తె శోభనను తన చెల్లెలి కుమారుడితో నిశ్ఛితార్థం చేసుకోవాలనుకున్నాడు. అయితే తన వద్ద చిల్లిగవ్వ లేదు. గొర్రెలను అమ్మినా పెళ్లి ఖర్చులకు సరిపోదు. అన్నదమ్ములకు రెండెకరాల పొలం ఉండగా, ఇంకా పంపకాలు జరగలేదు.
దీంతో ఏం చేయాలో దిక్కుతోచక మనస్తాపానికి గురైన నరసింహులు రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఊరి బయట గల వంకలోని చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఉదయమే పొలాలకు నీరు వదిలేందుకు వెళ్లిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుమార్తెలిద్దరూ తమ తండ్రి మృతదేహంపై పడి ‘ఇక మాకు దిక్కెవరంటూ’ ఏడ్వడం అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఎస్‌ఐ తమ సిబ్బందితో నేర స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.