షాక్ తగలని కరెంటు తీగలు వచ్చేస్తున్నాయ్!
విశాఖపట్నం: విద్యుత్ వైర్లను తాకితే ఏమవుతుంది? షాక్ కొట్టి క్షణాల్లో ప్రాణం పోతుంది. ఇకమీదట విద్యుత్ తీగలను ముట్టుకున్నా షాక్ కొట్టవు! ఎందుకంటే? విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు లోపల.. రబ్బర్‌తో కవర్ చేసిన కండక్టర్లు పైన ఉండేవి వచ్చేస్తున్నాయి.
అందువల్ల ముట్టుకున్నా, పట్టుకున్నా అవేమీ చేయవన్నమాట! స్వీడన్‌లో తయారైన ఈ కవర్డ్ కండక్టర్లను తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా విశాఖలో ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటిదాకా ఇలాంటి కవర్డ్ కండక్టర్ల వ్యవస్థ దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటకలో మాత్రమే ఉంది. ఇప్పుడు విశాఖలోనూ ప్రయోగాత్మకంగా అమలు కానుంది. ఈ కవర్డ్ కండక్టర్లను స్వీడన్ నుంచి దిగుమతి చేసుకోనుంది. భూగర్భ విద్యుత్ లైన్లకంటే ఈ కవర్డ్ కండక్టర్లకయ్యే ఖర్చు కూడా బాగా తక్కువని, వీటన్నిటిని దష్టిలో ఉంచుకుని కవర్డ్ కండక్టర్ల వైపు మొగ్గు చూపుతున్నామని చెప్పారు. ఇవి ఏర్పాటయితే ప్రాణ నష్టాన్ని నివారించడంతో పాటు విద్యుత్ సరఫరాలో అవాంతరాలను నిరోధించవచ్చని అధికారులు భావిస్తున్నారు.