రైల్వేకోడూరు రూరల్: వరకట్నం కేసులో తనకు న్యాయం చేసేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐను అన్యాయంగా సస్పెండ్ చే శారని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని అంకన్న గారి శ్వేత అనే మహిళ తన తండ్రి లక్ష్మీకర్‌రెడ్డి, బంధువులతో కలిసి సోమవారం ఆందోళన చేపట్టింది. అన్ని పార్టీల నాయకులు ఆమెకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. దాదాపు 3 గంటల పాటు కడప–తిరుపతి జాతీయ రహదారిపై వాహనాలు ఆగిపోయాయి.
బాధితుల కథనం మేరకు వివరాలలోకి వెళితే.. పట్టణానికి చెందిన అంకన్నగారి లక్ష్మీకర్ రెడ్డి తన కుమార్తెను మంగంపేటకు చెందిన పోలి మధుసూదన్‌రెడ్డి కుమారుడు జై భరత్ రెడ్డికి ఇచ్చి గత ఏడాది ఫిబ్రవరి 5న వివాహం చేశారు. అల్లుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడని రూ.15 లక్షలు నగదు, 1.5 కేజీల బంగారం కట్నంగా ఇచ్చారు. నాలుగు నెలల తర్వాత తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, పిల్లలు కూడా ఉన్నారని శ్వేత తెలుసుకుంది. దీంతో వారి కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. గర్భం దాల్చిన శ్వేతను ఆమె భర్త, మామ, అత్త శకుంతల, ఆడపడుచు ప్రత్యూష వేధిస్తుండటంతో ఆమె ఈ ఏడాది మే 7న వారిపై పోలీసు కేసు పెట్టింది. ఈ కేసు విచారణకు ప్రత్యేక అధికారిగా మన్నూరు సీఐని నియమించారని, ఆయన వద్దకు రెండు సార్లు వెళ్లగా కేసులో భర్త పేరు ఉంచి మిగిలిన వారి పేర్లు తొలగించాలని ఒత్తిడి తెచ్చారని బాధితురాలు పేర్కొంది. ఇన్ని ఒత్తిడులున్నప్పటికీ కోడూరు ఎస్‌ఐ నలుగురిపై కేసు నమోదు చేశారు. అందువల్లే ఆయనను అన్యాయంగా సస్పెండ్ చేశారని, ఎస్‌ఐని విధుల్లోకి తీసుకోవాలని ఆమెతో పాటు పలువురు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఓఎస్డీ సత్యయేసు బాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు.
మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నం
ఆందోళన విరమించిన తర్వాత జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు తిరుపతి వైపు వెళుతున్నారని తెలుసుకున్న కొంత మంది ఆయన కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో మస్తాన్ అనే వ్యక్తి తలకు గాయమైంది. పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలికి న్యాయం చేస్తాం– ఓఎస్డీ
బాధితురాలికి న్యాయం చేస్తామని ఓఎస్డీ సత్యయేసు బాబు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషనులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కేసు విషయంలో బాధితురాలికి తాము అండగా ఉండి న్యాయం చేస్తామన్నారు. తమ వద్ద కొన్ని ఆధారాలు ఉండటం వల్లే ఎస్‌ఐను సస్పెండ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సీహెచ్ చంద్రశేఖర్, పీసీసీ అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర, సీహెచ్ రమేష్, నాగేంద్ర, హేమరాజ్, రమణ, నవీన్, సుమన్, శివయ్య, మోహన్, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎస్‌ఐను అన్యాయంగా సస్పెండ్ చేశారు
Published Mon, Sep 19 2016 11:30 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement
Advertisement