ఇంజినీరింగ్ విద్యార్థులకు అండగా ఉంటాం
కానూరు(పెనమలూరు) : ఇంజినీరింగ్ చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థులకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు ప్రకటించారు. కానూరులోని కాలేజీ ప్రాంగణంలో 1987-1991 మధ్యలో చదివిన విద్యార్థులు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సమావేశం నిర్వహించారు. యుఎస్ అపోలో హాస్పటల్ సీఈవో గోపాలం గోపీనా«థ్ మాట్లాడుతూ విద్యార్థులు నూతన ప్రయోగాలు చేస్తే వారికి 5 వేల డాలర్లు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సంఘ అధ్యక్షుడు సి.రవికుమార్ మాట్లాడుతూ తాము కార్పస్ ఫండ్ కింద రూ 4 కోట్లు సమకూర్చామన్నారు. ప్రతి ఏడాదీ ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ 30 లక్షలు ప్రోత్సాహకం అందజేస్తామని వివరించారు. ఈ సమావేశానికి దేశ, విదేశాల నుంచి 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుని సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో కాలేజీ కన్వీనర్ ఎం.రాజయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, డీన్ పాండురంగారావు, సంఘ కార్యదర్శి జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.