శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న క్రీడాకారిణి సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్
తిరుచానూరు: ఒలింపిక్ బ్యాడ్మింటన్ రజత విజేత సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్‌లు శనివారం రాత్రి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు జీ.భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ రవి స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఈ క్రీడాదిగ్గజాలకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీవారి దర్శనార్థం వీరు తిరుమలకు వెళ్లారు.