బంగారు ఆభరణాలలో పైడితల్లి అమ్మవారు
సిరుల తల్లి రావమ్మా..
Published Mon, Oct 17 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
నేడు సిరిమానోత్సవం
ఆద్యంతం ఆసక్తిగొలిపే ఊరేగింపు
మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా
విజయనగరానికి పండగ శోభ
ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
భారీగా పోలీసు బందోబస్తు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : సిరిమానోత్సవం.. ఈ పేరు వింటే భక్తకోటి పరవశించిపోతుంది. అ అద్భుత ఘడియలను కనులారా వీక్షించేందుకు పరితపిస్తుంది. ఆద్యంతం ఆసక్తిగొలిపే సిరిమానోత్సవానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతోంది. రెండున్నర శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది. లక్షలాది భక్తజనం ఇప్పటికే విజయనగరం చేరుకుంది. ప్రతి ఇల్లు పండగ శోభతో కళకళలాడిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. విజయనగరం వెలిగిపోతోంది. ఒకప్పుడు గ్రామదేవత.. ఇప్పుడామె అందరి దేవత. పైడితల్లి కీర్తి ఎల్లలు దాటింది. పసిడితల్లి కరుణాల కటాక్షాల కోసం ఎక్కడెక్కడివారో సిరిమాను పండగ నాటికి విజయనగరం చేరుకుంటారు. సిరిమాను రథం ఊరేగింపు ప్రారంభమయ్యేసరికి మూడు లాంతర్లు, రాజాబజారు, కోట కూడలికి చేరుకుంటారు. పూజారి రూపంలోని అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. సిరిమానోత్సవం విజయవంతమయ్యేందుకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సిరిమానోత్సవంలో ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు 11వ సారి సిరిమానును అధిరోహించనున్నారు. రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా.
అన్నీ రసవత్తర ఘట్టాలే
భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో అన్నీ రసవత్తర ఘట్టాలే. 55 అడుగుల పొడవున్న సిరిమాను ఉపరితలంలో బిగించే ఇరుసుపై ప్రధాన పూజారి విసనకర్ర చేతబట్టి ఆశీనులవుతారు. రెండో చివర రథంపై అమర్చిన ఇరుసును మానుకు అమరుస్తారు. దాని ఆధారంగానే మాను పైకి లేస్తుంది. గజపతిరాజ వంశీయుల తరపున ఒకరు తాడు లాగడంతో ప్రారంభమయ్యే సిరిమాను ఊరేగింపు మూడులాంతర్ల వద్ద గల పైడితల్లి అమ్మవారి గుడి వద్ద నుంచి రాజాబజారు మీదగా కోట వరకు మూడుసార్లు తిరుగుతుంది. ఊరేగింపు ఆద్యంతం విసనకర్ర విసురుతూ కనిపించే సిరిమాను పూజారిని భక్తులు అరటిపండ్లతో కొలుస్తారు.
అత్యంత నియమనిష్టలతో..
అత్యంత నియమనిష్టలు, ఉపవాసంతో ఉండే సిరిమాను పూజారి తాళ్లపూడి భాస్కరరావు హుకుంపేటలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతారు. కాలినడకన వేలాది మంది భక్తుల సందడితో ఊరేగింపుగా వస్తారు. దారి పొడవునా ప్రజలు పూజారి పాదాలపై పసుపు నీళ్లు పోసి దీవెనలు అందుకుంటారు. చంటి పిల్లలపైనుంచి పూజారి దాటితే వారికి మేలు జరుగుతుందన్న నమ్మకంతో చాలామంది ఆయనొచ్చే దారిలో వారిని నేలపై ఉంచుతారు. పూజారి చేరుకున్నాకే సిరిమానోత్సవం ప్రారంభమవుతోంది. 258 సంవత్సరాల చరిత్ర గల సిరిమాను చదురు గుడి నుంచి మహారాజ కోట వరకు మూడు పర్యాయాలు తిరిగి భక్తులను ఆశీర్వదించనుంది. సిరిమాను ముందుండే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథాలు ఆకర్షణగా నిలుస్తాయి.
బెస్తవారి వల
రెండున్నర శతాబ్ధాలకు మునుపు అమ్మ తల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమైనప్పుడు కలలో అమ్మవారు చెప్పిన సమాచారం ప్రకారం పైడితల్లి మూల విరాట్‌ను చెరువు నుంచి వెలికితీయడంలో విజయనగరం యాతవీధికి చెందిన జాలర్లు సహకరించారు. అమ్మ సాక్షాత్కారానికి ఆదిలోనే పాత్రులైన ఆ బెస్తలే కీలకంగా వ్యవహరించారు. నాటి నుంచి ఏటా ఈ వలను యాతవీధి జాలర్లు తయారు చేస్తుంటారు. చేపల వేటకెళ్లేటప్పుడు వాడే ప్రతి వస్తువును వల కింద భాగంలో ధరించి ఉత్సవంలో పాల్గొంటారు. వీరంతా ఒంటికి పసుపు రాసుకుని, వేప కొమ్మలు, జాలరి వస్తువులను చేతబట్టి సంబరంలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
పాలధార
సిరిమాను సంబరం ప్రారంభానికి ముందు పాలధార ఆలయానికి రావడం అనాదిగా వస్తున్న ఆచారం. జాలరి వలను వెన్నంటి ఈటెలు చేతపట్టి వచ్చే ఈ జనం మహా శక్తి స్వరూపాలుగా భావిస్తారు. పాలధారగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి వారసులంటారు. తొలుత కొందరు ఈటెలను ధరించి అమ్మవారి ఆలయానికి వస్తారు. అక్కడ పైడిమాంబను దర్శించుకున్న అనంతరం డప్పు వాయిద్యాలతో కోట వద్దకు చేరుకుంటారు. అక్కడ పూజలు చేసిన అనంతరం కోట పశ్చిమ భాగం వైపు వెళ్లి, కోట శక్తికి నమస్కరిస్తారు. సైనికులుగా పనిచేసే వీరంతా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో గ్రామ కట్టడిని చేస్తారు. ఈ ఘట్టంలో సాకేటి వీధికి చెందిన డోకుల ఎరుకయ్య, మండల కామేష్, అలుగోలు బంగారయ్య, రామవరపు సూర్యనారాయణ కుటుంబసభ్యులు పాల్గొంటారు.
అంజలి రథం
సిరిమాను జాతరలో అంజలి రథానిది విలక్షణమైన స్థానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగుతుంది కాబట్టి దీనిని అంజలి రథమని పిలుస్తారు. అంజలి అంటే నమస్కారం. పైడిమాంబను నమస్కరిస్తూ అంజలి రథంపై ఉన్న నడిపేన, కోరాడ కుటుంబాల వారు ముందుకు సాగుతారు. నాటు బండిపై రోలును బిగించి, దానికి అటు ఇటు రాటలను కడతారు. దానిపై ఐదుగురు పురుషులు మహిళల వేషధారణలో కూర్చుంటారు. వీరంతా ఆరుమూరల నార చీరను, చేతికి వెండి సందెలను ధరిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు ఊరేగింపుగా చదురుగుడి వద్దకు వస్తారు. వీరంతా అమ్మవారి పరిచారికలుగా వ్యవహరిస్తారు. సంబరం జరుగుతున్నంతసేపూ భక్తులపై అక్షింతలు విసురుతుంటారు. ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటి పండ్లను వారిపై విసురుతుంటారు.
తెల్ల ఏనుగు
పైడితల్లమ్మ సిరిమాను సంబరంలో తెల్ల ఏనుగుకు విశిష్ట స్థానం ఉంది. పూసపాటి గజపతులు ముస్తాబు చేసిన అంబారీ ఏనుగుపై కూర్చుని సంబరంలో పాల్గొనేవారు. సిరిమానుకు ముందు పట్టపుటేనుగు నడిచేది. రాచరికం అంతరించి, ప్రజాస్వామ్యం వచ్చాక పట్టపుటేనుగునకు గుర్తుగా 1956 నుంచి ఏనుగు ఆకారంలో ఒక బండిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఏనుగుపై ఒక పురుషుడు, ఏడుగురు పురుషులు స్త్రీ వేషాలను ధరించి కూర్చొంటారు. స్త్రీలంతా పైడితల్లమ్మకు అక్కాచెల్లైల్లైన గ్రామ దేవతలుగా, మగవేషంలో ఉన్న వ్యక్తి అమ్మవారి సోదరుడు పోతురాజుగా భావిస్తారు. వెదురుతో తయారైన ఈ ఏనుగుపై భోగాపురం, పెద్దింటి తదితర కుటుంబాల సభ్యులు కూర్చుంటారు.
Advertisement