వైభవంగా సంజీవరాయుడికి పొంగళ్లు
పుల్లంపేట: మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో వెలసివున్న సంజీవరాయుని స్వామి (ఆంజనేయస్వామి)కి ఆదివారం అంగరంగ వైభవంగా పొంగళ్లు నిర్వహించారు. అయితే దేశంలో ఎక్కడాలేని వింత ఆచారం ఇక్కడ ఉంది. తమ పూర్వికుల నుంచి ఆ ఆచారం వస్తోందని ప్రజలు చెబుతున్నారు. ఈ ఆలయంలోకి ఆడవారికి, ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశం లేదు. 1516 సంవత్సరంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు గ్రామానికి వచ్చి కరువుతో అల్లాడుతున్న తిప్పాయపల్లె గ్రామాన్ని రక్షించడం కోసం ఒక రాతిశిలను తీసుకొచ్చి దానిపై బీజాక్షరాలు చెక్కి మంత్రాలతో సంజీవ రాయస్వామి అని నామకరణం చేశారు. అనంతరం ఆలయంలోకి 10 సంవత్సరాల్లోపు ఆడపిల్లలు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించాలని నిబంధన పెట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆడవారు ఆలయం లోపలికి వెళ్లకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి పూజలు చేస్తున్నారు. స్వామి వల్ల తమ గ్రామంలో పాడి పంటలు, సిరి సంపదలతో, సుఖసంతోషాలతో ఉన్నామని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తిప్పాయపల్లె గ్రామ వాసులు దూర ప్రాంతాల్లో ఎక్కడవున్నా సంక్రాంతికి ముందువచ్చు ఆదివారం గ్రామానికి చేరుకుంటారు. అనంతరం మగవారు మాత్రమే స్వామి వారికి పాలు, నెయ్యితో పొంగళ్లు నిర్వహిస్తారు. ఆ ప్రసాదాన్ని కూడా మగవారికి మాత్రమే పంపిణీ చేస్తారు. రాత్రివేళ సంజీవరాయుడే శ్వేత గుర్రంపై సంచరిస్తూ, గ్రామాన్ని కాపాడుతున్నాడని వారి నమ్మకం. కోర్కెలు తీరుస్తాడని జిల్లా నుంచేకాక, విదేశాల నుంచి కూడా పలువురు ఇక్కడికి వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు.