
అక్కా నీ వెంటే నేను
- ఒకే రోజు అక్కాచెల్లెలు మృతి
చింతమానుపల్లె(సి.బెళగల్):
మరణంలో అక్కాచెల్లెలు బంధం వీడలేదు. అక్క మరణాన్ని తట్టుకోలేక చెల్లి గుండె ఆగింది. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటన చింతమానుపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తెలుగు చిన్న ఆంజనేయులు, హనుమంతు సోదరులకు ఇనగండ్ల గ్రామానికి చెందిన అక్కా చెల్లెలు సవరమ్మ(70), సరోజమ్మ (68)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. సవరమ్మకు కడుపులో గడ్డలు ఉన్నాయంటూ 4 నెలలుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి సవరమ్మ అంత్యక్రియలను నిర్వహిస్తుండగా సరోజమ్మ గుండె పోటుకు గురై కుప్పకూలి పోయింది. అక్కాచెల్లెలు మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.