చార్మినార్: పాత కేసుల్లో నిందితుడైన శాలిబండ మజ్లిస్ పార్టీ కార్పొరేటర్ మహ్మద్ ముస్తాఫా అలీ ముజఫర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతడిని అరెస్టు చేయాలని మంగళవారం సిట్ పోలీసులు పాతబస్తీ తగారీ కానాకాలోని అతడి ఇంటికి వెళ్లారు. అతను లేకపోవడంతో సిట్ పోలీసులు వెనుతిరిగారు. విషయం తెలిసి చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ.. ముజఫర్ ఇంటికి వెళ్లి పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2012లో చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం విషయంలో మక్కా మసీదు వద్ద అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు.
ఈ ఘటనపై హుస్సేనీఆలం పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఏ–1గా మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్, ఏ–2గా మాజీ కార్పొరేటర్ ముఖరం అలీతో పాటు ఏ–3గా మజ్లిస్ పార్టీ నాయకులు, ప్రస్తుతం శాలిబండ కార్పొరేటర్ అయిన మహ్మద్ ముస్తాఫా అలీ ముజఫర్ ఉన్నారు. అనంతరం ఈ కేసు సిట్‌కు బదిలీ అయింది. గత జూలై 27న ఏ–1గా ఉన్న మహ్మద్ గౌస్‌ను సిట్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించగా ఈనెల 5న విడుదలయ్యాడు. ఈ కేసులో ఏ–3గా ఉన్న ముజఫర్‌ను కూడా అరెస్ట్ చేయడానికి సిట్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.