కల్హేర్,న్యూస్‌లైన్: మండలంలోని మాసాన్‌పల్లిలో శనివారం పోలీసు పహరాలో ఎస్‌ఎంసీ కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ బందోబస్తు మధ్య జరిగిన సమావేశంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించారు. నారాయణఖేడ్ సీఐ నందీశ్వర్‌రెడ్డి చొరవ తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులకు నచ్చజెప్పారు. పాఠశాలలో వంటలు చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు, స్థానికులు పథకం అమలు పర్చేందుకు అంగీకరించారు. అంతకు ముందు మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పథకం అమలుపై కొందరు విముఖత కనబర్చారు.
మరో సారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూస్తామని సీఐ నందీశ్వర్‌రెడ్డి, ఎంఈఓ మన్మథ కిశోర్, ఉపాధ్యయులు భరోసా ఇచ్చారు. ఈనెల 18న జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజనం తిని 75 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. విద్యార్థుల అస్వస్థత కారణంగా వారి తల్లిదండ్రులు, స్థానికులు మధ్యాహ్నభోజనం నిర్వహణ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే భోజన పథకాన్ని పునరుద్ధరించాలని డీఈఓ రమేష్ అదేశించినా ఫలితం లేకుండాపోయింది. ఓ వైపు భోజన పథకం నిర్వహించవద్దని తల్లిదండ్రులు, స్థానికులను హెచ్చరించారు. దీంతో జెడ్పీహెచ్‌ఎస్, ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలుపుదల చేశారు. ఎంఈఓ మన్మథ కిశోర్ పాఠశాలను సందర్శించి భోజన పథకం నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసుల రాకతో ఎట్టకేలకు మధ్యాహ్నభోజన సమస్య పరిష్కారమైంది. తాత్కాలికంగా వంట నిర్వాహకులను ఏర్పాటు చేసి వంటలు చేశారు. డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్ పాఠశాలను సందర్శించి మద్యాహ్నభోజనం పథకాన్ని పునరుద్ధరించారు. అంతేకాకుండా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిర్గాపూర్ ఎస్‌ఐ విజయ్‌రావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాటు చేయడంతో మాసాన్‌పల్లి పాఠశాల వద్ద ఎన్నికలను తలపించే వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్, పుష్పలత హన్మండ్లు, కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు దిలీప్‌కుమార్, ఎస్‌ఎంసీ కమిటీ బాధ్యులు నారాయణ, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.