అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న వీఆర్‌ఓ ప్రభు
- పర్యావరణానికి పట్టిన చీడ
- పట్టించుకోని అధికారులు
మెదక్ రూరల్: మెదక్ మండలంలోని హవేళి ఘణాపూర్ గ్రామశివారులో నుండి సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు మట్టిని జోరుగా తరలించారు. జేసిబిలతో తవ్వి టిప్పర్లలో జోరుగా తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి.
గ్రామస్తుల సమాచారం మేరకు సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో హవేళి ఘణాపూర్ గ్రామ వీఆర్‌ఓప్రభు అక్కడికి చేరుకొని ఆరు టిప్పర్లను అడ్డుకొని అక్కడి నుండి పంపించేయడం పట్ల గ్రామస్తులు మండిపడ్డారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే సంబంధిత వాహనాలను సీజ్‌చేయాల్సిందిపోయి వారికే వత్తాసు పలుకుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై తహశీల్దార్ అమినొద్దీన్‌ను సాక్షి వివరణ కోరగా పట్టా భూమి నుండే మట్టిని తరలిస్తున్నప్పటికీ అనుమతులు తీసుకోకపోవడంతో నిలిపివేశామన్నారు.