నా దారి.. రహదారి! | Soldiers land occupied at kurnool-nandyal highway | Sakshi
Sakshi News home page

నా దారి.. రహదారి!

Published Wed, Apr 27 2016 4:49 PM | Last Updated on Mon, Oct 22 2018 8:44 PM

Soldiers land occupied at kurnool-nandyal highway

 ఓర్వకల్లు సమీపంలో ‘రియల్’ దర్జా

కర్నూలు: అది కర్నూలు నుంచి నంద్యాల రహదారికి సమీపంలోని అత్యంత ఖరీదైన స్థలం. సైన్యంలో అందించిన సేవలకు గుర్తింపుగా సిపాయిలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలం. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కేవలం వెంచర్‌కు మాత్రమే ఉపయోగపడేలా ఓ దారి కూడా నిర్మించుకుంది. వెంచర్‌కు అవతలి వైపున్న రైతుల భూములతో పాటు ప్రభుత్వ భూములకు దారి లేకుండా అడ్డంగా గోడ కూడా నిర్మించడం గమనార్హం. ఓర్వకల్లుకు సమీపంలోని పారిశ్రామికవాడకు కూతవేటు దూరంలో కొండపై ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ దర్జా ఇది. తమ పొలాలకు దారి లేకుండా మూసివేశారని రైతులు వాపోతున్నా.. ఇక్కడి రెవెన్యూ అధికారులు ఏమాత్రం చలించని పరిస్థితి.
 
వెంచర్‌కు ‘లుక్’ కోసమే..
వాస్తవానికి ఈ వెంచర్‌కు దారి పక్కనే ఉంది. ఆ దారి వెంచర్‌కు వెనుక వైపునకు వెళ్తుంది. తద్వారా వెంచర్‌లో విల్లాలు కొనుగోలు చేసే వారికి వెంచర్ అంత పెద్ద అట్టహాసంగా కనిపించే అవకాశం లేదు. అందుకోసం మిలిటరీ వారికి కేటాయించిన ఈ స్థలాన్ని వినియోగించుకుంటే.. వెంచర్ ముందు భాగానికి దారి వెళ్తుంది. అప్పుడు వెంచర్‌కు మంచి లుక్ వస్తుందనేది వీరి ఆలోచనగా ఉంది. అందుకోసమే ఈ స్థలాన్ని కొనుగోలు చేసి దారి నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అటువైపుగా ఉన్న రైతుల భూములతో పాటు ప్రభుత్వ స్థలాలకు కూడా దారి వదలకుండా వెంచర్‌లో అడ్డంగా గోడును నిర్మించుకున్నారు. దీంతో రైతులతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లే అధికారులు కూడా పాత దారిలోనే వెళ్లాల్సి వస్తోంది.

రెవెన్యూ అధికారులకు మామూళ్లు?
ప్రభుత్వ స్థలంలో దారి నిర్మించుకున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం వెనుక రెండు కారణాలు ఉన్నట్టు సమాచారం. ఒకటి.. ఈ దారి గుండా అటువైపుగా రైతులతో పాటు ప్రభుత్వ స్థలాలకు వెళ్లేందుకు దారిని వదులుతానని సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ హామీ ఇవ్వడం. అయితే, ఈ హామీని సదరు రియల్ ఎస్టేట్ సంస్థ పట్టించుకోనప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడానికి తెరవెనుక లాలూచీ వ్యవహారమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ దారి నిర్మాణంలో జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులకు కూడా భారీగానే మామూళ్లు ముట్టాయనే ప్రచారం జరుగుతోంది.
 
 ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం
ఇది మొదట్లో ప్రభుత్వ స్థలం. దీనిని మిలిటరీ వారికి గతంలో కేటాయించారు. వారు విక్రయించుకునేందుకు వీలుగా నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) తెచ్చుకున్నారు. వారి నుంచి రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే, అవతల రైతుల పొలాలకు దారి లేకుండా చేశారని ఫిర్యాదులు వస్తే వారితో చర్చించి న్యాయం చేస్తాం.
- రామాంజులు నాయక్, ఓర్వకల్లు తహశీల్దార్
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement