వైవీయూలో గంభీర వాతావరణం
వైవీయూ :
యోగివేమన విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ అంశం వెలుగు చూడటంతో విశ్వవిద్యాలయంలో గంభీర వాతావరణం నెలకొంది. ఎవరిని పలుకరిస్తే ఏమో అన్న చందంలో విద్యార్థులు, అధ్యాపకులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. వైవీయూలో ర్యాగింగ్ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించారు. యాంటీ ర్యాగింగ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించి ప్రతిరోజు తరగతిలో పాఠం కన్నా ముందుగా 5 నిమిషాల పాటు ర్యాగింగ్ గురించి తెలియజేయాలని సూచించారు.
ఈనెల 31వ తేదీలోపు అన్ని విభాగాల్లో ఫ్రెషర్స్‌డే వేడుకలు నిర్వహించాలని, దీనికి ఆయా విభాగాల సమన్వయకర్తలు, విభాగాధిపతులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించాలని, సెక్యూరిటీని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా సాయంత్రం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ర్యాగింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కాగా మంగళవారం రాత్రి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, చీఫ్ వార్డెన్ ఆచార్య జి. గులాంతారీఖ్, వార్డెన్‌లు వసతి గృహాలను తనిఖీ చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా ర్యాగింగ్ అంశంపై ఇప్పటికే విచారణ పూర్తయిందని, బుధవారం రెక్టార్ వచ్చిన తర్వాత ఈ నివేదికను యూజీసీ వారికి పంపనున్నట్లు తెలిపారు.