తల్లిని కాపాడిన తనయులు
గుత్తి : భూ తగాదాలతో మనస్తాపం చెంది మెడకు ఉరితాడు తగిలించుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న తల్లిని సరైన సమయంలో తనయులు వచ్చి కాపాడారు. బాధితులు, పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుత్తిలోని బీసీ కాలనీలో లక్ష్మీదేవి(32) నివాసముంటోంది. ఈమె భర్త పక్కీరప్ప ఐదేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. పక్కీరప్పకు, ఆయన సోదరులకు కలిసి ఉమ్మడిగా మూడు ఎకరాల భూమి ఉంది. తన భర్త వాటా తనకు ఇవ్వాలని లక్ష్మీదేవి బావలను అడుగుతూనే ఉంది. అయితే వారు ఇవ్వడానికి నిరాకరిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో లక్ష్మిదేవి సోదరులు మంగళవారం గుత్తికి వచ్చి ఇదే విషయంపై చర్చించారు. అప్పటికీ వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెంది ఇంటికి వెళ్లిపోయిన లక్ష్మీదేవి గవాక్షానికి తాడుతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. తల్లి ఆవేశంగా వెళ్లిపోవటాన్ని చూసిన తనయులు కుమారస్వామి (4వ తరగతి), కులశేఖర్ (7వ తరగతి)లు మిద్దెపై నుంచి గవాక్షాన్ని కడ్డీతో పగులగొట్టి లోపలికి వెళ్లి తల్లి మెడకు వేసుకున్న ఉరితాడును తొలగించి కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.