త్వరలో 453 ఆరోగ్య ఉప కేంద్రాలకు భవనాలు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : జిల్లాలో రూ.76.73 కోట్ల వ్యయంతో 453 ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను నాబార్డు నిధులతో నిర్మిస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. రూ.575 కోట్ల నాబార్డు నిధులతో చేపట్టిన 223 అభివృద్ధి పనుల ప్రగతి తీరుపై బుధవారం ఆయన సమీక్షించారు. జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యసేవలు విస్తృతం చేసి ప్రతి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండేలా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ఉపకేంద్రాలకు పటిష్టమైన భవన నిర్మాణ పనులు చేపడతామన్నారు. నాబార్డు ఆర్థిక సహాయం రూ.100 కోట్ల వ్యయంతో 948 అంగన్‌వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. హార్టీకల్చర్ యూనివర్సిటీ, ఎన్‌జీ రంగా యూనివర్సిటీలకు కేటాయించిన నిధుల పనులు నత్తనడకన సాగడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో నాబార్డు ఏజీఎం రామప్రభు, ఆర్‌అంఽడ్‌బీ ఎస్‌ఈ నిర్మల, పంచాయతీరాజ్ ఎస్‌ఈ ఈ.మాణిక్యం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.కోటేశ్వరి పాల్గొన్నారు.
మల్బరీ తోటలకు ప్రోత్సాహం
ఏలూరు సిటీ : జిల్లాలో మల్బరీతోటలను ప్రోత్సహించి తక్కువ ఖర్చుతో లాభాల పంట సాధించేలా రైతులను చైతన్యపరచడానికి మల్బరీపై ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో మల్బరీతోటల పెంపుపై ఆన్‌లైన్‌లో రైతులకు సేవలందించేందుకు అనువుగా ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 2 వేల ఎకరాల్లో మల్బరీతోటలు పెంచాలని ఒక ప్రణాళికను చేపట్టామని ఇందుకోసం 4 వేల మంది రైతుల పేర్లను 15 రోజుల్లో ఈ యాప్ ద్వారా నమోదు చేయాలని చెప్పారు.