
‘ఉత్తరాది’ హవా
38వ జాలీయ సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో ఉత్తరాది రాష్ట్రాలదే పై చేయిగా నిలుస్తోందని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు, జిల్లా అధ్యక్షుడు నాగరాజులు తెలిపారు.
→ సాఫ్ట్‌బాల్ టోర్నీలో వెనుకబడుతున్న దక్షిణాది జట్లు
→ హోరాహోరీగా సాగుతున్న పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : 38వ జాలీయ సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీల్లో ఉత్తరాది రాష్ట్రాలదే పై చేయిగా నిలుస్తోందని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు, జిల్లా అధ్యక్షుడు నాగరాజులు తెలిపారు. గురువారం అనంతపురంలోని ఆర్డీటీ క్రీడామైదానంలో జరిగిన క్రీడా పోటీల వివరాలను వారు వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్ర బాలికల జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి వైదొలిగే పరిస్థితి నెలకొంది. నిలకడగా ఆడుతున్న ఆంధ్ర, తెలంగాణ జట్లు సూపర్–8 దశకు చేరుకునే సరికి చతికిలబడ్డాయి. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు వీరు గట్టిపోటిని ఇవ్వలేకపోయారు. మోహన్ (చత్తీస్‌గడ్), రితేష్ (మహారాష్ట్ర), షంతీల్ (పంజాబ్) హోమర్ షాట్‌లతో అలరించారు.
బాలుర విభాగంలో విజేతలు
మణిపూర్‌పై చత్తీస్‌గడ్, తెలంగాణపై హర్యానా, చండీఘడ్‌పై ఆంధ్ర, పాండిచ్చేరిపై పంజాబ్, వెస్ట్ బెంగాల్‌పై మహారాష్ట్ర జట్టు క్రీడాకారులు భారీ విజయాన్ని నమోదు చేశారు. ఏకపక్షంగా సాగిన ఈ పోటీల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క పాయింట్ కూడా దక్కలేదు. ఢిల్లీ జట్టుపై కర్ణాటక (3–4), ఒడిశాపై కేరళ (1–3), గోవాపై మధ్యప్రదేశ్ (1–8) జట్లు గెలుపొందాయి.
బాలికల విభాగంలో...
తెలంగాణపై పంజాబ్, బీహార్‌పై మహారాష్ట్ర, కర్ణాటకపై ఢిల్లీ, పాండిచ్చేరిపై చండీఘడ్ జట్టు క్రీడాకారిణులు పట్టు సాధించారు. ఏకపక్షంగా సాగిన ఈ పోటీల్లో ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయారు. మణిపూర్‌పై హిమాచల్ ప్రదేశ్ (2–11), చత్తీస్‌ఘడ్‌పై మధ్యప్రదేశ్ (2–14), ఆంధ్రపై కేరళ (1–6), హర్యానాపై ఒడిశా (1–16) గెలుపొందాయి.
సూపర్‌లీగ్‌లో...
ఉత్కంఠగా సాగిన బాలికల సూపర్ లీగ్ పోటీల్లో మహారాష్ట్ర జట్టుపై పంజాబ్ క్రీడాకారులు 7–8 పాయింట్ల తేడాతో గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్‌పై ఢిల్లీ, మధ్యప్రదేశ్‌పై కేరళ, చండీఘడ్‌పై ఒడిశా జట్లు గెలుపొందాయి. బాలుర విభాగంలో హర్యాణను చత్తీస్‌గడ్, ఆంధ్రను పంజాబ్, కర్ణాటకను కేరళ, మధ్యప్రదేశ్‌ను మహారాష్ట్ర, ఆంధ్రను చత్తీస్‌గడ్ జట్లు ఓడించాయి.