వాటర్ బాటిల్ రాకెట్ ప్రయోగాన్ని పరిశీలిస్తున్న దత్తాత్రేయ
గన్ ఫౌండ్రీ: ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాలను అధిగమించి ఎన్నో విజయాలు సాధించడం భారత దేశానికి గర్వ కారణమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఆదర్శ్ నగర్‌లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్‌లో ఇండియన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, బిర్లా సైన్స్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న మార్పులను నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఇటీవల విజయాలు అందించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం రాకెట్ల తయారీ, సోలార్ వినియోగం, రాకెట్ లాంచ్ ల పనితీరుపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో విద్యార్థులకు వివరించారు.
అంతకు ముందు ఇస్రో బృందం తయారు చేసిన వాటర్ బాటిల్ రాకెట్ లాంచ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. క్విజ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్ సెల్వరాజ్, ఇస్రో డిజిఎం టిఎస్ రఘురామ్, శాస్త్రవేత్త కె. సునీల్, పలు కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.