- బంద్‌కు అన్నివర్గాల స్వచ్ఛంద సహకారం
- వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు
జనాగ్రహాన్ని చూసైనా కళ్లు తెరవండి
Published Sat, Sep 10 2016 9:30 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
కాకినాడ:
ప్రజాగ్రహాన్ని చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో దగా చేసిన టీడీపీ, బీజేపీలను నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం నిర్వహించిన బంద్ అనంతరం ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. బంద్‌కు అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయడాన్ని చూస్తే ప్రజల్లో ప్రత్యేక హోదా ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల అభీష్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలను స్వాగతిస్తున్నానంటూ ముఖ్యమంత్రి ప్రకటించడంపై మండిపడ్డారు. విభజన చట్టంలోని అంశాలే తప్ప కొత్తగా ఏపీకి ఆ ప్యాకేజీలో ఏమీ లేవన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో పన్నుల రాయితీలు, కొత్త పరిశ్రమలు, కొత్త నిధులు లేకుండా కేంద్రం ఏమిచ్చిందని చంద్రబాబు సరిపెట్టుకున్నారని నిలదీశారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ప్రజలను భ్రమల్లోపెట్టి అధికారంలోకి వచ్చాక ఏరుదాటాక తెప్పతగలేసిన చందాన వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గుర్తించి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పనిచేయకపోతే అదే ప్రజల ఛీత్కారాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement