
ఎన్నాళ్లో వేచిన హృదయం!
అనంత వాయువుల్లో కలిసిపోతున్న ప్రాణాలను సైతం అరచేరుు అడ్డుపెట్టి నిలబెట్టగల దేవుళ్లు వైద్యులు..అందుకే వారిని వైద్యో నారాయణ హరి అన్నారు.. ఇలాంటి కోవలోకే వస్తారు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే.. శరీరానికి వైద్యం చేసి.. గుండెల్లో కొలువుంటారాయన.. ఆరు జిల్లాల ఆరోగ్య ప్రదారుునిగా ఉన్న జీజీహెచ్ ఖ్యాతిని రెట్టింపు చేస్తూ గుండె మార్పిడి ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.. ప్రభుత్వ ప్యాకేజీపై స్పష్టత లేకపోరుునా.. దాతల ఔదార్యాన్నే ఆలంబనగా చేసుకుని పేదోడి గుండెకు ఆయుష్షు పోస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెరుున్ డెడ్ అరుు కట్టెగా మారిన అభాగ్యుల హృదయ స్పందనను పది కాలాలపాటు బతికుండేలా చేస్తున్నారు.
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోనే తొలిసారిగా జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గత నెల 18వ తేదీలోపే గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించాలని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ గుండె దానం చేసే దాత దొరక్క పోవడంతో కొంత ఆలస్యమైంది. జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతులు అయితే వచ్చాయిగానీ, ఇంత వరకు ఈ ఆపరేషన్‌కు ఎంత ప్యాకేజీ ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు దాతల సహాయంతో ముందుకు సాగుతున్నారు. జీజీహెచ్‌లో ఇప్పటికే గుండె మార్పిడి ఆపరేషన్ కోసం ఇద్దరు రోగులు ఎదురు చూపులు చూస్తున్న విషయం తెలిసిందే.
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ కల నేటితో సాకారం కానుంది. కార్పొరేట్ వైద్యశాలలో గుండె మార్పిడి ఆపరేషన్‌కు లక్షల్లో డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాను చదువుకున్న గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించాలనే సంకల్పంతో డాక్టర్ గోఖలే సహృదయ ట్రస్టు ద్వార పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ ( పీపీపీ) పద్ధతిలో ముందుకు వచ్చారు. ఇప్పటికే జీజీహెచ్‌లో నిరుపేద రోగులకు ఏడాది కాలంలో 159 గుండె ఆపరేషన్లు నిర్వహించి చరిత్ర సృష్టించారు. పలు దురదృష్ట సంఘటనల ద్వారా మసక బారిన జీజీహెచ్ ప్రతిష్ట గుండె మార్పిడి ఆపరేషన్‌తో మళ్లీ పెరగనుంది. జీజీహెచ్‌లో జరిగే ఈ మహా యజ్ఞం విజయవంతం కావాలని అంతా కోరుకుంటున్నారు.
భర్త గుండెతో మరొకరికి ప్రాణం పోయాలని..
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలేనికి చెందిన రంపచోటి వెంకట్రావు (24) మంగళవారం తన భార్యను చూసేందుకు జీ పంగలూరు వెళుతుండగా మేదరమెట్ల జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిపోయాడు. జీజీహెచ్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించి అవయవదానంపై కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో కుటుంబ సభ్యుల ఆమోదంతో వెంకట్రావు శరీరంలోని అన్ని అవయవాలను దానం చేశారు. గర్భిణి అరుున వెంకట్రావు భార్య శిరీష దుఖాన్ని పంటి బిగువన బిగపట్టి ఈ మహాయజ్ఞానికి పురుడు పోసింది.