ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడి ప్రత్యేకత
ఖైరతాబాద్: వినాయక చవితి దగ్గర పడుతుండడంతో ఖైరతాబాద్ మహా గణపతి తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 20 రోజుల్లో వచ్చే చవితికి ఆదిదేవుడు ‘శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహా గణపతి’గా 58 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. మహాగణపతి విగ్రహ తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక మిగిలిన పెయింటింగ్ పనులు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతాయని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.
నీలి వర్ణంలో నిలబడిన రూపంతో దర్శనమిచ్చే మహాగణపతి వెనుక వైపు పుట్ట, నాగేంద్రుడి వెల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఎడమవైపు బాలాజీ బృందావన సహిత గోవర్ధనగిరి పనులు 90 శాతం పూర్తయ్యాయి. కుడివైపు తిరుపతి వేంకటేశ్వర స్వామి పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. వినాయకచవితి వారం రోజుల ముందే ఈ మహా రూపుడు పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనమిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు.
ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవీ..
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం షెడ్డు ఎత్తు తగ్గించారు. మహాగణపతి విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుకు కుదించారు. తొలిసారి మహాగణపతి పక్కన 18 శక్తి పీఠాలలో మొదటి శక్తిపీఠం శ్రీలంకలోని శాంకరీదేవి అమ్మవారు, చివరి శక్తిపీఠమైన జమ్ము కశ్మీర్‌లోని కాశ్మీరేతు సరస్వతి అమ్మవారి విగ్రహాలు ప్రత్యేకం. శివలింగంతో పాటు నాగేంద్రుడు మహాగణపతి వెనుక ఉండటం, తిరు వేంకటేశ్వరుడితో పాటు పద్మావతి, ఆండాళ్లు అమ్మవార్లను కలిపి నిలపడం ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకత.
తాపేశ్వరం నుంచి 500 కిలోల లడ్డూ
యేటా లాగే ఈ సంవత్సరం కూడా తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు ఆధ్వర్యంలో 500 కిలోల మహా లడ్డూ ప్రసాదం రానుంది. మహా గణపతికి లడ్డూ నైవేద్యం తయారీకి ఆదివారం ఉదయం తాపేశ్వరంలో పందిరి రాట పాతి, వినాయకుడికి ముడుపు బియ్యం కట్టినట్టు మల్లిబాబు తెలిపారు. ప్రత్యేక దీక్షలో ఉండే లడ్డూ తయారీ పనులు ప్రారంభిస్తారు.