తెలంగాణ స్టేజీ–1 పనులు వేగవంతం
-
పవర్‌హౌస్ సైట్ లెవల్ పనులు పూర్తి
-
బాయిలర్ సైట్‌లెవల్ ప్రారంభం
-
స్టేజీ–2లో 2400 మెగావాట్ల నిర్మాణం
-
ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ రాక?
జ్యోతినగర్: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ వద్ద తలపెట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజీ–1 పనులు వేగవంతంగా కొనగసాగుతున్నాయి. పవర్‌హౌస్ సైట్ లెవల్ పనులు పూర్తికాగా, బాయిలర్ సైట్ లెవల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తెలంగాణ స్టేజీ–1లో భాగంగా నూతనంగా నిర్మించనున్న 8,9 యూనిట్లకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టులో రామగుండం రానున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ సోమవారం ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుసుకుని తెలంగాణ స్టేజీ–1 పనుల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరారు. ఈ క్రమంలో ఆగస్టులో రానున్నట్లు ప్రధానమంత్రి సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు ప్రధాని నరేంద్రమోడీ పర్యటనపై ప్రచారం జరిగింది. దీంతో ఏప్రిల్‌లో కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు రామగుండం సందర్శించి హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌సింగ్ సైతం రామగుండం ఎన్టీపీసీని సందర్శించి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ప్రధాని పర్యటన వాయిదా పడింది.
రాష్ట్ర విభజన చట్టంలోని హామీ మేరకు తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చేందుకు 4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ఎన్టీపీసీ సంస్థ అంగీకరించింది. దానిలో భాగంగా తెలంగాణ స్టేజీ–1లో 2“800=1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 10,598.98 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. గతేడాది జనవరి 29న జీరో డేట్‌గా ప్రకటించి నిర్మాణ æపనులను ప్రారంభించారు. డిసెంబర్ 14న పర్యావరణ అనుమతిలో భాగమైన సెంట్రల్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ స్టేజీ–1లో 1600 మెగావాట్ల రెండు యూనిట్ల పవర్ పర్చేజ్ ఒప్పందం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆదేశాల మేరకు రేటు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడానికి అంగీకారం కుదిరింది. అలాగే రామగుండంలో ఆల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో తెలంగాణ స్టేజీ–2లో 3“800=2400 మెగావాట్ల యూనిట్ల నిర్మాణానికి కూడా అంతర్గతంగా అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. నూతన టెక్నాలజీతో తక్కువ బొగ్గు వినియోగంతో ఎక్కువ విద్యుత్ జరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గుగనుల నుంచి బొగ్గు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు అందుబాటులో ఉన్నాయి. మేడిపల్లి సింగరేణి ఓసీపీ ప్రాజెక్టు జీవిత కాలం పూర్తవుతున్న క్రమంలో దానిని యాష్‌పాండ్ కోసం ఎన్టీపీసీ సంస్థ వినియోగించుకోనుంది. ఎక్కువ మొత్తంలో బూడిద వెలువడనున్న క్రమంలో యాష్‌పాండ్‌కు రాష్ట్రప్రభుత్వం భూమి కేటాయించేందుకు సుముకంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీపీసీ రామగుండంలో 2600 మెగావాట్ల థర్మల్, 10 మెగావాట్ల సోలార్, తెలంగాణ స్టేజీ–1లో 1600 మెగావాట్లు, రెండో దశలో 2400 మెగావాట్ల యూనిట్లు నిర్మాణం పూర్తయితే మొత్తంగా 6,610 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రికార్డులకెక్కనుంది.