ప్రోత్సాహంతో క్రీడా వికాసం
ప్రోత్సాహంతో క్రీడా వికాసం
Published Mon, Aug 29 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
– చిన్నారులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
– భవిష్యత్ క్రీడలకు పెద్దపీట వేయనున్న ప్రభుత్వం
– జాతీయ కీడాదినోత్సవ సభలో జేసీ హరికిరణ్
కల్లూరు: ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతోనే క్రీడా వికాసం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్నారు. సోమవారం 22వ జాతీయ క్రీడాదినోత్సవాన్ని (ధ్యాన్‌చంద్ జయంతిని) నగరంలోని డీఎస్‌ఏ అవుట్‌డోర్ స్టేడియం బాస్కెట్‌బాల్ కోర్టు ఆవరణలో డీఎస్‌డీఓ మల్లికార్జున అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అంతకు ముందు ధ్యాన్‌చంద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఒలింపిక్స్ విజేతలు సింధూ, సాక్షి మాలిక్‌లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ కనబరిచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడలతో శారీరక ఆర్యోగంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందన్నారు. స్నేహ సంబంధాలు మెరుగుపడి, క్రీడాకారులకు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. జిల్లా నుంచి రెండు వేల మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొన్నారని డీఎస్‌డీఓ మల్లికార్జున వెల్లడించారు. క్రీడాభివద్ధికి ప్రభుత్వాలు తగిన చేయూత ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రుల తమ పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ తర్ఫీదు ఇప్పించాలన్నారు. గెలుపునకు ఓటమి పునాది వంటిదని, క్రీడాకారులు గెలుపోటమలును సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని స్పెషల్ కలెక్టర్ బీవీ సుబ్బారెడ్డి అన్నారు. క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉన్నట్లు చెప్పారు. ఒలింపిక్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్, రామాంజనేయులు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో హాకీ జిల్లా కార్యదర్శి సుధీర్, సెపక్‌తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement