ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు వారాల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. ఉచిత దర్శనం మొదలుకుని, అతి శీఘ్ర దర్శనం (టికెట్ ధర రూ.100) వరకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.
అలాగే ఆలయంలో ప్రత్యేక ప్రసాద వితరణ కేంద్రాలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ సిబ్బందితో పాటు దాదాపు 50 మందికి పైగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు నిరంతర అన్నదానం, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలు అందించేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ ఈఓ ముత్యాలరావు ఆలయ ఏఈఓ మధు, సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు.
పెళ్లిళ్ల శోభ: దాదాపు రెండు నెలల విరామం అనంతరం శ్రావణమాసం వివాహ ముహూర్తాలు ప్రారంభం కావడంతో గురువారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాలు పెళ్లిళ్ల శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 25కి పైగా జంటలు స్వామివారి సమక్షంలో ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు మాట్లాడుతూ శ్రావణమాసం నెల రోజుల పాటు వివాహాలకు శుభదినాలన్నారు. అనంతరం విజయదశమి వరకు మంచి ముహూర్తాలు లేవని వారు తెలిపారు.
ఉత్సవాల వివరాలు
ఆగస్టు 6 మొదటి శనివారం: సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామిని శేషవాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఆగస్టు 13 రెండవ శనివారం: ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఒంటెవాహనంపై ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఆగస్టు 20 మూడవ శనివారం: సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామిని గజవాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఆగస్టు 27 నాల్గవ శనివారం: సాయంత్రం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగిస్తారు.
అలాగే శ్రావణమాసం నాలుగు మంగళవారాలు ఆంజనేయస్వామిని ఒంటñ æవాహనంపై ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.