శ్రీచైతన్య విద్యార్థి ఆత్మహత్య
Published Tue, Aug 30 2016 1:13 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
– ప్రేమ వ్యవహారమే కారణం?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు శివారులోని బి.తాండ్రపాడు శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మహ్మద్ అక్రమ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటకు అక్రమ్ హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. శిరివెళ్ల మండలం ముళ్లపేటకు చెందిన మహ్మద్ రఫీ, మోబీను దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో అక్రమ్ మొదటి వాడు. రెండో కుమారుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అక్రమ్ బి.తాండ్రపాడు సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, రెండేళ్ల క్రితం రఫీ గుండెపోటుతో చనిపోగా తల్లి సంరక్షణలో ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. ఇటీవల అక్రమ్ ప్రేమలో పడినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి ఆరోగ్యం బాగలేదని చెప్పిన అక్రమ్ ఐస్ క్రీమ్ తిని హాస్టల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు చివరి క్షణంలో తన సెల్ నుంచి లవర్‌కు పలు మెసేజ్‌లు పంపినట్లు తెలిసింది. వీటిని అమ్మాయి తల్లిదండ్రులు గమనించి వార్నింగ్ ఇవ్వడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
అక్రమ్‌కు సెల్ ఎక్కడ నుంచి వచ్చింది?
మరోవైపు కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు సెల్‌ఫోన్లను వినియోగించడం నిషేధం. విద్యార్థులు తమ బంధువులతో మాట్లాడాలంటే రూపాయి కాయిన్ ఫోన్లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచుతాయి. అయితే దాదాపు రూ.15 వేల విలువ చేసే సోనీ కంపెనీకి చెందిన ఆండ్రాయిడ్ ఫోన్ అక్రమ్ దగ్గర ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం గమనించలేకపోవడం గమనార్హం. మరోవైపు విషయం తెలిసిన వెంటనే తాలుకా పోలీసుస్టేషన్ సీఐ మహేశ్వరరెడ్డి, రూరల్ పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుయాదవ్ పోస్టుమార్టం రూమ్‌లో అక్రమ్ శవాన్ని పరిశీలించి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐలు వివరించారు.
నెల రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
కర్నూలు జిల్లాలో నెల రోజుల్లో శ్రీచైతన్య, నారాయణ జూనియర్ కళాశాలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణ జూనియర్ కళాశాలల్లో జూలై 27న అధ్యాపకుడు మందలించాడని సందీప్ అనే విద్యార్థి ఉరేసుకొని తనువు చాలించగా, ఆగస్టు 25న ప్రణయ్‌రెడ్డి అనే విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఆగస్టు 29న శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన మహ్మద్ అక్రమ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Advertisement
Advertisement