ముస్తాబైన జమలాపురం ఆలయం
- ఉత్సవాలకు ఆలయం ముస్తాబు
- భక్తుల వసతుల కల్పనకు ఏర్పాట్లు పూర్తి
జమలాపురం(ఎర్రుపాలెం): తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 1నుంచి 11వరకు నిర్వహించే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు. 1న సాయంత్రం 4.40 గంటలకు తీర్థపు బిందెను తెచ్చిన అనంతరం కలశ స్థాపన పూజలతో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈఓ ఏవీ రమణ మూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మలు తెలిపారు. 2న ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోమాతకు ప్రత్యేక పూజలు, ఉదయం 10గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహిస్తామన్నారు. 3న ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో శ్రీసోమేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, 4న ప్రసన్నాంజనేయ స్వామివారికి ప్రత్యేక ఆకు పూజ, 5న లక్ష తులసి అర్చన, 6న చండీహోమం, 7న శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లకు సామూహిక కుంకుమార్చన, హోమాలు వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 8న సరస్వతీ పూజలు, 9న దుర్గా పూజలు, 10న చండీహోమం, పూర్ణాహుతి, 11న విజయ దశమి పర్వదినం సందర్బంగా దసరా వేడుకలు, శమీ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. శ్రీదేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించినట్లు ఆలయ ఈఓ రమణమూర్తి తెలిపారు. ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి శ్రీ స్వామివారి, అమ్మవార్లను దర్శించుకోవాలన్నారు.