ఆక్వాపార్క్‌పై వైఎస్సార్‌ సీపీ సమరశంఖం | aqua parkpi ysrcp smarasankham | Sakshi
Sakshi News home page

ఆక్వాపార్క్‌పై వైఎస్సార్‌ సీపీ సమరశంఖం

Published Fri, Apr 7 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

ఆక్వాపార్క్‌పై వైఎస్సార్‌ సీపీ సమరశంఖం

ఆక్వాపార్క్‌పై వైఎస్సార్‌ సీపీ సమరశంఖం

నరసాపురం : తుందుర్రు గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమరశంఖం పూరించింది. మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువు కారణంగా ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోయినా తుందుర్రు ఆక్వా పార్క్‌ నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల మంది ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపించే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవడానికి వైఎస్సార్‌ సీపీ నరసాపురం నియోజకవర్గ కన్వీనర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆయన నిరాహారదీక్షకు కూర్చోనున్నారు. ఫుడ్‌పార్కు పనులు నిలిపివేయాలంటూ ఏడాదిన్నరగా ప్రజలు, ప్రతిపక్షపార్టీలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఫ్యాక్టరీ విషయంలో ముందుకెళుతోంది. ప్రభుత్వ విధానాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వైఎస్సార్‌ సీపీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ వస్తోంది. తాము పరిశ్రమలను వ్యతిరేకించడంలేదని, తుందుర్రు ఆక్వాపార్కును సముద్రతీర ప్రాంతంలో నిర్మించాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తోంది. 
విషప్రచారం చేస్తున్న ప్రభుత్వం
తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని వైఎస్సార్‌ సీపీ స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం ప్రతిపక్షంపై విషప్రచారం చేస్తోంది. తుందురు ఫ్యాక్టరీ వద్దంటూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ప్రభుత్వం విమర్శలకు దిగుతోంది. ఈ తరుణంలో మొగల్తూరు నల్లంవారితోటలోని ఆనందా ప్రా¯Œ్స ప్రాసెసింగ్‌ యూనిట్‌లో గత నెల 30న జరిగిన ఘోర ప్రమాదంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఈ చిన్న ఫ్యాక్టరీలో విషవాయువు కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మొగల్తూరు ఫ్యాక్టరీ కంటే తుందుర్రు ఫుడ్‌ పార్క్‌ 10 రెట్లకు పైగా పెద్దది కావడం గమనార్హం. అంత పెద్ద ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రాంతంలో తీవ్ర ప్రాణనష్టం తప్పదు. మొగల్తూరు ఫ్యాక్టరీ యాజమాన్యమే తుందుర్రు ఆక్వాపార్క్‌ను నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో తుందుర్రు ఫుడ్‌ పార్క్‌ను సముద్ర తీర ప్రాంతానికి తరలించాలి్సందేనని ఈ నెల 1న ముదునూరి ప్రసాదరాజు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించారు. 6వ తేదీలోగా దీనిపై ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా శుక్రవారం నుంచి నిరవధిక దీక్షకు కూర్చోనున్నారు. 
ఆళ్ల నాని సహా పలువురు నేతల రాక
ముదునూరి చేపట్టిన దీక్షకు సంఘీభావంగా శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానితో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్వీనర్లు, ముఖ్యనేతలు హాజరవుతున్నారు. పలువురు రాష్ట్రస్థాయి నేతలు కూడా వస్తున్నారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులతో పాటు, బాధిత గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.  
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement