నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాల్సిన ప్రాంతం
సాక్షి, నరసాపురం: ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. అయితే గత టీడీపీ ప్రభుత్వం అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హైడ్రామా నడిపింది. ఇందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంతెన అంశంలో వడివడిగా అడుగులు వేస్తోంది. వశిష్ట వంతెన నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నిర్ణయించారు. దీంతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్‌గట్కరీని ఢిల్లీలో సోమవారం కలవడానికి ఎంపీ, ఎమ్మెల్యే హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. దీంతో వంతెన విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మొదటి నుంచి వశిష్ట వంతెన విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కృతనిశ్చయంతో ఉన్నారు. కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా వంతెన నిర్మించి తీరతానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇప్పటికే లోక్‌సభలో వంతెన అంశాన్ని ప్రస్తావించి రెండు జిల్లాల ప్రజల ఇబ్బందులను ప్రధాని ఎదురుగా లోక్‌సభలో వివరించారు. ఇప్పుడు ఇద్దరు నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో వంతెన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వంతెన నిర్మించాలనే డిమాండ్ బ్రిటీష్ కాలం నుంచీ ఉంది. గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కోరిక. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ విషయంలోనూ లేని విధంగా నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు వంతెనపై దృష్టిపెట్టారు. స్వయంగా ప్రకటనలు చేశారు.
ముఖ్యమంత్రుల వద్ద నలిగిన వంతెన ఫైలు
వశిష్ట వంతెన అనేది దశాబ్దాల పోరాటం. బహుశా రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్‌కు ఇన్నిసార్లు శంకుస్థాపనలు, సర్వేలు జరగలేదు. బ్రిటీష్ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. బ్రిటీష్ పాలన మరికొంతకాలం ఉంటే కచ్చితంగా వారి హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మాణం జరిగేదని స్థానికంగా ఉండే పెద్దలు చెప్పుకుంటారు. కాగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇక ఎన్‌టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. అయితే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. రాజకీయ వత్తిళ్లతోనే ఇది జరిగిందనేది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పెద్దచర్చ.
అయితే అప్పటిలో వంతెన తరలించవద్దంటూ పెద్ద ఉద్యమమే సాగింది. ఇక అప్పటి నుంచీ నరసాపురం వెంతెన కథ సాగుతూనే ఉంది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కూడా వంతెన నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వంతెన నిర్మాణంపై ప్రకటనలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా వంతెన అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక గత ఐదేళ్లలో అయితే వంతెన విషయంలో టీడీపీ నేతలు పెద్ద డ్రామానే నడిపారు. వంతెన మంజూరు అయిపోయిందంటూ పలుమార్లు స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి హడావిడి చేశారు.
వైఎస్ హయాంలో రూ.94 కోట్లతో టెండర్లు..
వశిష్ట వంతెన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. ఆయన పాదయాత్ర సమయంలో తీరంలో పర్యటించినప్పుడు, వంతెన అవసరాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆయన రెండోసారి అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టారు. 2008 ఏప్రిల్ 15వ తేదీన వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అక్కడితో సరిపెట్టకుండా రూ.94 కోట్లతో టెండర్ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలు అన్నీ పూర్తయ్యాయి, ఇక వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. అయితే వేరే కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందారు. అయితే మైటాస్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు.
కచ్చితంగా నిర్మించి తీరుతాం.
వంతెన కట్టాలి.. లేదంటే కుదరదని చెప్పాలి. అంతేగాని ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన వెంటనే టెండర్ పిలిపించి పనులు మైటాస్ సంస్థకు అప్పగించారు. ఆయన బతికుంటే ఎప్పుడో బ్రిడ్జి పూర్తయ్యేది. కానీ ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం వంతెన వచ్చేసిందంటూ హడావిడి చేసింది. స్వీట్లు పంచుకున్నారు. ఇది మోసం చేయడం కాదా. మా హయాంలో ఇలాంటి మోసాలు ఉండవు. కచ్చితంగా వంతెన నిర్మాణం జరిపి తీరుతాం.
– ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే, నరసాపురం
Comments
Please login to add a commentAdd a comment