Vasishta Godavari
-
AP Govt: వశిష్ట నిర్మాణానికి ఓకే.. రూ.490 కోట్ల వ్యయంతో వారధి..
సాక్షి, ఏలూరు: తీరప్రాంత ప్రజల చిరకాల కోరికగా మిగిలిన వశిష్ట గోదావరి వారధి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక అడ్డంకులు, అవరోధాలు, కోర్టు కేసులను దాటుకుని వచ్చే జనవరిలో టెండర్లు నిర్వహించి యుద్ధప్రాతిపదికన పనులు నిర్వహించనున్నారు. వశిష్ట గోదావరిపై వంతెన కట్టి ప్రజల చిరకాల కల నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నర్సాపురం పర్యటనలో ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాలను కలిపే కీలక బ్రిడ్జి కావడంతో ముఖ్యమంత్రి ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రిటీష్ హయాంలోనే అంకురార్పణ జరిగిన ఈ వంతెన నిర్మాణం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వంతెన నిర్మాణం ప్రారంభమవుతుందన్న తరుణంలో ఆయన అకాల మృతితో ఆ ప్రయత్నం కూడా ఆగిసోయింది. మళ్లీ ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణంపై దృష్టి పెట్టారు. 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించి.. రూ.490 కోట్లతో నరసాపురం మండలం రాజుల్లంక గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. కోనసీమ జిల్లా చించినాడ మీదుగా నరసాపురం నుంచి ఒంగోలు వరకూ నిర్మించిన 216 జాతీయ రహదారికి బైపాస్ నిర్మించడం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. కోనసీమ జిల్లా శివకోడు నుంచి టేకిశెట్టిపాలెం మీదుగా ఉన్న స్టేట్‌హైవేను జాతీయ రహదారిగా మార్పుచేసి రామేశ్వరం మీదుగా ఇటు పశ్చిమగోదావరి జిల్లాలోని రాజుల్లంక, వైఎస్ పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారికి బైపాస్ హైవే రోడ్డు నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. పనులు మైథాస్ సంస్థకు అప్పగించారు. అయితే ఈ సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో మళ్లీ మరో కంపెనీకి వంతెన పనులు అప్పగించారు. కానీ ఆయన మృతితో పనులు నిలిచిపోయాయి. తరువాత టీడీపీ ప్రభుత్వం వంతెన విషయంలో అనేక డ్రామాలు నడిపింది. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి పేరు వస్తుందనే వంతెన నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరిలో వంతెన పనులకు టెండర్లు పిలుస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత తీసుకుని, బ్రిటీష్ కాలం నుంచి డిమాండ్‌గా ఉన్న వంతెన నిర్మాణానికి పూనుకుంటున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ దశాబ్దాల కలల వారధి 1910లో నరసాపురం పట్టణం వద్ద వంతెన నిర్మాణానికి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కేవలం రూ.70 వేలతో అంచనాలు తయారు చేసింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇక అప్పటి నుంచి నరసాపురం వశిష్ట వంతెన కథ నడుస్తూనే ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలోనూ నేతలు హామీలు ఇవ్వడం, మరిచిపోవడం జరుగుతోంది. 1986లో మొదటిసారిగా నరసాపురం వశిష్ట వంతెనకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. అయితే తరువాత రాజకీయ కారణాలతో ఇక్కడ నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో చంద్రబాబు హయాంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటూ హడావిడి చేసి శంకుస్థాపన చేశారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా కూడా వశిష్ట వంతెన నిర్మాణంపై సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటన చేసి హడావిడి చేయడం జరిగింది. కోర్టులకెక్కి ఆపే ప్రయత్నం.. నిజానికి ఈ నెల 18న నరసాపురంలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో శంకుస్థాపనలు జరిగిన రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లతో పాటే వశిష్ట వంతెనకు కూడా శంకుస్థాపన జరగాలి. అయితే స్థలసేకరణ విషయం వచ్చేసరికి ఈ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి బీజం పడితే జగన్ సర్కారుకు ఎక్కడ పేరు వస్తుందేమోనని.. ప్రతిపక్షాలు కుట్రలకు తెరలేపాయి. కావాలని అడ్డంకులు సృష్టించడానికి స్థల సేకరణ అంశంలో కోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు గట్టి ప్రయత్నం చేసి స్టేను వెకేట్ చేయించి, ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు. తీరా ముఖ్యమంత్రి పర్యటన దగ్గరికి వచ్చే సమయానికి మళ్లీ రెండోసారి కోర్టు నుంచి స్టే తీసుకువచ్చారు. దీని వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నట్టు సమాచారం. సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో.. చించినాడ 216 జాతీయ రహదారికి కోనసీమ జిల్లా నుంచి నరసాపురం వరకూ బైపాస్ నిర్మించి, మధ్యలో వంతెన నిర్మిస్తే ఈ ప్రాజెక్ట్‌కు మోక్షం కలుగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గట్కరీకి లేఖ రాయడం, శివకోడు సఖినేటిపల్లి మీదుగా రామేశ్వరం నుంచి నరసాపురం వరకూ 25 కిలోమీటర్ల మేర స్టేట్ హైవేను 216కు బైపాస్‌గా నేషనల్ హైవేగా మార్పు చేయాలని, మధ్యలో రాజుల్లంకవద్ద గోదావరిపై వంతెన నిర్మించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖకు స్పందించిన గట్కరీ వెంటనే ఆమోదం తెలపడంతో దశాబ్దాల వంతెన సమస్యకు లైన్ క్లియర్ అయ్యింది. -
పచ్చని కాపురంలో ‘అతడు’ రేపిన చిచ్చు
మామిడికుదురు: ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి నలుగురి ఆత్మహత్యకు కారణమైంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా ఆ దంపతులను సామూహిక ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది. చించినాడ బ్రిడ్జిపై నుంచి శుక్రవారం రాత్రి వశిష్ట గోదావరి నదిలో దూకినట్టుగా భావించిన నలుగురిలో ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో మొగలికుదురుకు చెందిన కంచి సతీశ్ (32)తో పాటు అతని కుమార్తె ఇందు శ్రీదుర్గ (2) మృతదేహాలను వశిష్ట నదిలో గుర్తించారు. సతీశ్ భార్య సంధ్య (22)తో పాటు వారి కుమారుడు జస్వన్ (4) మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మొగలికుదురులో తాపీ పని చేసుకుంటూ జీవించే సతీష్ మరికాస్త సంపాదించుకొని తమ బతుకురాత మార్చుకోవాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో మెరుగైన ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య సంధ్యకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడటం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ అయ్యింది. కుల పెద్దల సమక్షంలో రాజీ యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దలు పిల్లలు జస్వన్, శ్రీదుర్గలను మొగలికుదురులోనే ఉంచి, సంధ్యను ఆమె పుట్టిల్లయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు పంపించినట్టు చెబుతున్నారు. విషయం తెలిసి మనస్తాపం చెందిన సతీష్ పది రోజుల కిందట సౌదీ నుంచి స్వగ్రామం వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని కుటుంబ పెద్దలు ఓదార్చారు. పిల్లలతో సహా కేశవదాసుపాలెంలోని అక్క ఇంటికి పంపించారని చెబుతున్నారు. ఈ విషయంపై తన భార్య సంధ్యను కలిసి మాట్లాడాలని సతీశ్ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం వెలివలలోని పినమామ ఇంటి వద్ద ఆమె ఉంటోందని తెలుసుకుని.. కేశవదాసుపాలెం నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉన్నాడు. అనంతరం శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైకి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న సూసైడ్ నోట్‌ను, పిల్లల దుస్తులను, బైక్‌ను వంతెనపై వదిలేసి, గోదావరిలో దూకేశారని భావిస్తున్నారు. కుటుంబంలో వరుసగా జరిగిన పరిణామాలు అవమానకరంగా ఉండటం, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే సతీశ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అతడి తండ్రి భగవాన్‌దాసు, తల్లి లక్ష్మి, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. -
వంతెనల నిర్మాణాలకు సీఎం గ్రీన్ సిగ్నల్
సాక్షి, పి.గన్నవరం(తూర్పుగోదావరి) : ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తున్న లంక గ్రామాల ప్రజల కోసం వశిష్ట, వైనతేయ నదీపాయలపై పుచ్చల్లంక–అయోధ్యలంక, ఆనగర్లంక–యర్రంశెట్టి వారిపాలెం వంతెనల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు పడుతున్న ఇబ్బందులను గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఇటీవల జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈఈ భాస్కర కుమార్, డీఈఎంఎస్ నాగవర్మలు శుక్రవారం ఈ వంతెనల నిర్మాణ ప్రాంతాలను శుక్రవారం బోట్లపై వెళ్లి పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వం పుచ్చల్లంక, ఆనగర్లంక వంతెనలకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి గాలికి వదిలేసింది. ఈ వంతెనల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పి.గన్నవరం మండలం మొండెపులంక సరిహద్దులో ఉన్న పశ్చిమ జిల్లా పుచ్చల్లంక నుంచి అయోధ్యలంక వంతెనకు రూ.50 కోట్ల వ్యయంతో గత టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసి, అనంతరం విస్మరించింది. ప్రస్తుత నిర్మాణ వ్యయం రూ.70 కోట్లకు పెరిగింది. అలాగే టీడీపీ ప్రభుత్వం వదిలేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఆనగర్లంక నుంచి పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం వంతెన నిర్మాణానికి కూడా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వంతెన నిర్మాణ ప్రాంతాల పరిశీలన కార్యక్రమంలో మంత్రి తనయుడు చెరుకువాడ నర్సింహరాజు (నరేష్‌రాజు), వైఎస్సార్ సీపీ నాయకులు సుంకర సీతారామ్, కె.సత్యనారాయణ, ఎం.రాంబాబు, జి.బాలకృష్ణ, వై.ప్రసాద్, ఆర్.చంటి, పీఆర్ అధికారులు పాల్గొన్నారు. -
వశిష్ట వంతెన కోసం గళమెత్తిన ముదునూరి
సాక్షి, నరసాపురం(పశ్చిమగోదావరి) : ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించే అంశంపై నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సోమవారం అసెంబ్లీలో గళమెత్తారు. 60 ఏళ్ల నుంచి అదిగో వంతెన.. ఇదిగో వంతెన అంటూ గోదావరి ప్రాంత వాసులను మభ్యపెడుతున్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో ముదునూరి వశిష్ట వారధి అంశాన్ని ప్రస్తావించారు. వశిష్ట వంతెనకు ఐదుసార్లు శంకుస్థాపనలు చేశారని పలువురు ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటనలు చేశారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని సార్లు శంకుస్థాపనలు జరిగిన ప్రాజెక్టు ఏదీ లేదన్నారు. అసలు బ్రిడ్జి నిర్మాణంలో ఇంతజాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. వైఎస్ మరణం శాపంగా మారింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనను చేసి టెండర్లు కూడా పిలిచారని చెప్పారు. అయితే ఆయన మృతి చెందడంతో ఈ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్ మృతి చెందడం బ్రిడ్జి నిర్మాణానికి శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పనులు దక్కించుకున్న మైటాస్ సంస్థ సంక్షోభంలో కూరుకు పోయినా కూడా వేరే సంస్థ సబ్ కాంట్రాక్టు తీసుకుందని వివరించారు. కానీ అప్పటి ప్రభుత్వం సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించలేదన్నారు. దీంతో సదరు సబ్ కాంట్రాక్టర్ మాకు పనులు ఎందుకు అప్పగించలేదంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం కోర్టులో ఈ అంశాన్ని పరిష్కరించకుండా కొత్తగా వంతెన మంజూరైందని, కడతామని ప్రకటనలు గుప్పించిందని విమర్శించారు. ప్రభుత్వానికి సూచన వంతెన నిర్మాణ విషయంలో ముదునూరి అసెంబ్లీలో ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు ఉంచారు. ప్రస్తుతం నరసాపురం నుంచి 216వ జాతీయ రహదారి వెళుతుందని చెప్పారు. ఈ జాతీయ రహదారికి అనుసంధానంగా తూర్పుగోదావరి జిల్లాలో శివకోడు నుంచి ఉన్న రాష్ట్ర రహదారిని సఖినేటిపల్లి మీదుగా జాతీయ రహదారిగా మార్పుచేసి అందులో భాగంగా వంతెన కూడా నిర్మించాలని సూచించారు. ఈ 23 కిలో మీటర్లు జాతీయ రహదారిగా మారిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో వంతెనను నిర్మించవచ్చునన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే వంతెన నిర్మించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
వారధి కోసం కదిలారు మా‘రాజులు’
సాక్షి, నరసాపురం: ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలనేది దశాబ్దాల డిమాండ్. అయితే గత టీడీపీ ప్రభుత్వం అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హైడ్రామా నడిపింది. ఇందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంతెన అంశంలో వడివడిగా అడుగులు వేస్తోంది. వశిష్ట వంతెన నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు నిర్ణయించారు. దీంతో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నితిన్‌గట్కరీని ఢిల్లీలో సోమవారం కలవడానికి ఎంపీ, ఎమ్మెల్యే హుటాహుటీన బయలుదేరి వెళ్లారు. దీంతో వంతెన విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదటి నుంచి వశిష్ట వంతెన విషయంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కృతనిశ్చయంతో ఉన్నారు. కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారా వంతెన నిర్మించి తీరతానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇప్పటికే లోక్‌సభలో వంతెన అంశాన్ని ప్రస్తావించి రెండు జిల్లాల ప్రజల ఇబ్బందులను ప్రధాని ఎదురుగా లోక్‌సభలో వివరించారు. ఇప్పుడు ఇద్దరు నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లడంతో వంతెన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వంతెన నిర్మించాలనే డిమాండ్ బ్రిటీష్ కాలం నుంచీ ఉంది. గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కోరిక. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ విషయంలోనూ లేని విధంగా నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు వంతెనపై దృష్టిపెట్టారు. స్వయంగా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రుల వద్ద నలిగిన వంతెన ఫైలు వశిష్ట వంతెన అనేది దశాబ్దాల పోరాటం. బహుశా రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్‌కు ఇన్నిసార్లు శంకుస్థాపనలు, సర్వేలు జరగలేదు. బ్రిటీష్ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. బ్రిటీష్ పాలన మరికొంతకాలం ఉంటే కచ్చితంగా వారి హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మాణం జరిగేదని స్థానికంగా ఉండే పెద్దలు చెప్పుకుంటారు. కాగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఇక ఎన్టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. అయితే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. రాజకీయ వత్తిళ్లతోనే ఇది జరిగిందనేది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న పెద్దచర్చ. అయితే అప్పటిలో వంతెన తరలించవద్దంటూ పెద్ద ఉద్యమమే సాగింది. ఇక అప్పటి నుంచీ నరసాపురం వెంతెన కథ సాగుతూనే ఉంది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కూడా వంతెన నిర్మాణ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వంతెన నిర్మాణంపై ప్రకటనలు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా వంతెన అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక గత ఐదేళ్లలో అయితే వంతెన విషయంలో టీడీపీ నేతలు పెద్ద డ్రామానే నడిపారు. వంతెన మంజూరు అయిపోయిందంటూ పలుమార్లు స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి హడావిడి చేశారు. వైఎస్ హయాంలో రూ.94 కోట్లతో టెండర్లు.. వశిష్ట వంతెన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. ఆయన పాదయాత్ర సమయంలో తీరంలో పర్యటించినప్పుడు, వంతెన అవసరాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆయన రెండోసారి అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టారు. 2008 ఏప్రిల్ 15వ తేదీన వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అక్కడితో సరిపెట్టకుండా రూ.94 కోట్లతో టెండర్ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలు అన్నీ పూర్తయ్యాయి, ఇక వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. అయితే వేరే కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందారు. అయితే మైటాస్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు. కచ్చితంగా నిర్మించి తీరుతాం. వంతెన కట్టాలి.. లేదంటే కుదరదని చెప్పాలి. అంతేగాని ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన వెంటనే టెండర్ పిలిపించి పనులు మైటాస్ సంస్థకు అప్పగించారు. ఆయన బతికుంటే ఎప్పుడో బ్రిడ్జి పూర్తయ్యేది. కానీ ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం వంతెన వచ్చేసిందంటూ హడావిడి చేసింది. స్వీట్లు పంచుకున్నారు. ఇది మోసం చేయడం కాదా. మా హయాంలో ఇలాంటి మోసాలు ఉండవు. కచ్చితంగా వంతెన నిర్మాణం జరిపి తీరుతాం. – ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే, నరసాపురం -
‘చంద్రబాబు సినిమా చూపిస్తున్నారు’
సాక్షి, నరసాపురం : ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారు. రాజధాని మాదిరిగానే అదిగో ..వశిష్ట వారధి...ఇదిగో వశిష్ట వారధి అంటూ నరసాపురం ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. ప్రతి ఎన్నికలప్పుడు చంద్రబాబుకు వశిష్ట వారధి గుర్తుకు వస్తుంది. వశిష్ట వారధి నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచిపోయారు. మత్స్యకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. వేట విరామ సమయంలో రూ.4వేలు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. అలాగే బియ్యప్పుతిప్ప హార్బర్‌ను పక్కనపెట్టారు. ఇక చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ ఆపేశారు. డీజిల్‌కు రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం లేదు. అధికారంలోకి వచ్చాకా మత్స్యకారులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. గతంలో మత్స్యకారులు చనిపోతే వెంటనే డబ్బులు వచ్చేవి. ఇప్పుడు వారు చనిపోతే డబ్బులు రావడం లేదు.’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని స్టీమర్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మత్య్సకారులకు కార్పొరేషన్ ఏర్పాటు ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు కొత్త బోట్లు ఇస్తాం. అంతేకాకుండా వేట విరామ సమయంలో వారికి నెలకు రూ.10వేలు, మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే బీమా కింద పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాంర. అలాగే బోట్లపై డీజిల్‌కు సబ్సిడీ ఇస్తాం.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పనవి కూడా చంద్రబాబు చేశారట..! చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 98 శాతం హామీలు అమలు చేశారట. చెప్పనవి కూడా చంద్రబాబు చేశారట. రైతుల రుణాలను మాఫీ చేశారట. బాబు రుణమాఫీ వడ్డీలకైనా సరిపోతుందా?. పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా?. బీసీలు జడ్జిలు కాకుండా చంద్రబాబు లేఖలు రాస్తారు. జస్టిస్ ఈశ్వరయ్య చంద్రబాబు లేఖను చూపించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 12 మంత్రి పదవులు ఇస్తానన్న చంద్రబాబు ఏపీలో మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని పునరుద్దరిస్తాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నవరత్నాలు పథకాన్ని తీసుకు వస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. పేదవాడి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకువస్తే దాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. మనం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పునరుద్దరిస్తాం. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా సరే ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తాం. కుటుంబ పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా విశ్రాంతి అవసరం అయితే ఆ సమయంలో పేషెంట్‌కు ఆర్థిక సాయం చేస్తాం. డయాలసిస్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తాం. అవ్వా తాతలకు రూ.2వేల పెన్షన్, అంతేకాక వారి పెన్షన్ వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పెన్షన్ ఇస్తాం. వైఎస్ జగన్ ఇంకా ఏమి మాట్లాడారంటే... చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు రైతులు గిట్టుబాటు ధర లేక చనిపోతున్నారు ఒక్క పంటకైన సీఎం చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర పలికిందా? నరసాపురంలో 4వేల ఎకరాల్లో ఉప్పుపంట సాగవుతుంది ఉప్పు రైతులకు గిట్టుబాటు ధరల్లేవు, గిడ్డంగులు లేవు ఉప్పు బస్తాను దళారీలు కేజీ రూ.1.70 పైసలకు కొంటున్నారు అదే ఉప్పును అదే ఉప్పును ప్యాకింగ్ చేసి హెరిటేజ్‌లో కేజీ రూ.10కి అమ్ముతున్నారు నరసాపురంలో చేతి అల్లికలు మీద 15వేలమంది మహిళలు ఆధారపడి జీవిస్తున్నారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేతి అల్లికల మహిళకు పెద్ద పీట వేశారు. చేతి అల్లిక మహిళలకు నెలకు రెండు వేలు సబ్సిడీ కింద ఇస్తాం -
తెరమీదకు మళ్లీ వశిష్ట వారధి
ఈసారి నిర్మాణ బాధ్యతలు కేంద్రానివి దశాబ్దాల కల నెరవేరేనా? నరసాపురం అర్బన్ :వశిష్ట గోదావరిపై ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వంతెన నిర్మించాలనే డిమాండ్ బ్రిటీష్ కాలం నుంచీ ఉంది. ఇది గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కోరిక. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకూ లేని విధంగా ఈ వారధికి నాలుగుసార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఐదుగురు ముఖ్యమంత్రులు వంతెనపై దృష్టిపెట్టారు. పనిమాత్రం జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ వంతెన అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రూ.200 కోట్లతో వంతెన నిర్మాణానికి యత్నిస్తున్నట్టు సమాచారం. మరి ఈ సారైనా వంతెన నిర్మాణానికి పునాదులు పడతాయా? లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.1800 కోట్లతో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టనున్నారు. డ్రెడ్జింగ్ హార్బర్ నిధుల్లోనే రూ.200 కోట్లు ఖర్చుపెట్టి వంతెన నిర్మించాలనేది, తాజా ప్రయత్నం. ఈమేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరికి లేఖ ఇచ్చారు. డ్రెడ్జింగ్ హార్బర్ నిధులతో వశిష్ట గోదావరిపై రైల్‌కమ్ రోడ్డు వంతెన నిర్మించాలని కోరారు. దీనికి సంబంధించి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఎంతవరకూ సాధ్యం నరసాపురంలో వంతెన నిర్మిస్తే, డ్రెడ్జింగ్ హార్బర్‌కు రవాణా సదుపాయం ఏర్పడుతుందని డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు స్థానిక నేతలు నివేదికలు ఇచ్చారు. అయితే ఇప్పటికే నరసాపురానికి 15 కిలోమీటర్లు దూరంలో యలమంచిలి మండలం చించినాడ వద్ద గోదావరిపై వంతెన ఉన్న నేపథ్యంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇక్కడ మరో వంతెనకు రూ.200కోట్లు ఖర్చుచేస్తుందా? అనేది ప్రశ్న. అయితే పెరవలి నుంచి నరసాపురం వరకూ ఫోర్‌లైన్ రోడ్లు, నరసాపురం తీరంలో హార్బర్ నిర్మాణ ప్రతిపాదనలు చాలాకాలంగా ఉన్నాయి. దీంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నరసాపురంలో వంతెన నిర్మాణం జరుగుతుందనేది అధికారుల మాట. ఇంకోవైపు స్వయంగా ముఖ్యమంత్రే కోరారు కాబట్టి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఒప్పుకోవడం అనేది లాంఛనమేనని చెబుతున్నారు. ఇది ఏ మేరకు ముందుకెళ్తుందనేది వేచిచూడాలి. దశాబ్దాల వేదన నరసాపురం వశిష్ట వంతెన నిర్మాణాన్ని బ్రిటీష్ హయాంలోనే చేపట్టాలని యోచించారు. అయితే అప్పుడు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీరామారావు హయాంలో వంతెన నిర్మించాలనే నిర్ణయానికి బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరిజిల్లాలోనూ శంకుస్థాపన చేశారు. అయితే సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. అప్పటిలో వంతెన తరలించవద్దంటూ పెద్ద ఉద్యమమే సాగింది. ఇక అప్పటి నుంచీ నరసాపురం వంతెన కథ సాగుతూనే ఉంది. 2003లోనూ అప్పడు రాష్ట్ర మంత్రిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటిలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనూ వంతెన నిర్మాణ యత్నాలు జరిగాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా అసెంబ్లీలో కూడా వంతెన అంశాన్ని ప్రస్తావించారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. వైఎస్ మృతితో ఆగిన వంతెన నరసాపురం వశిష్ట వంతెనకు ఎందరు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని శంకుస్థాపనలు చేసినా.. ఈ విషయంలో చొరవ చూపింది మాత్రం వై.ఎస్.రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన పాదయాత్రల సమయంలో తీరంలో పర్యటించినప్పుడు, వంతెన అవసరాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో ఆయన రెండవసారి అధికారంలోకి రాగానే వంతెన నిర్మాణంపై దృష్టిపెట్టారు. 2008 ఏప్రిల్ 15న వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. అక్కడితో సరిపెట్టకుండా రూ.194 కోట్లతో నిర్మాణ పనులను మైటాస్ కంపెనీకి అప్పగించారు. సర్వేలన్నీ పూర్తై ఇక వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థకు చెందిన మైటాస్ కంపెనీ సంక్షోభంలో కూరుకుపోవడంతో పనులు నిలిచాయి. దీంతో వేరే కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలోనే ఆయన ప్రమాదవశాత్తూ దుర్మరణం పాలవడంతో వంతెన నిర్మాణం సాధ్యం కాలేదు. ఆ తర్వాత మైటాస్ వద్ద సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధపెట్టలేదు. దీంతో వంతెన పనులు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణానికి వై.ఎస్. హయాంలో మైటాస్ సంస్థ, ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన నివేదికలనే.. ప్రస్తుతం యథాతథంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు అందించడం విశేషం.